జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ లోనే మవోయిస్టులు పంజా విసిరారు.  ఓ బ్రిడ్జిని పేల్చేశారు. అయినా జనం ఓటేసేందుకు పోటెత్తారు. తొలిదశలో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా రికార్డుస్థాయిలో 62.87 పోలింగ్ నమోదైంది.  


జార్ఖండ్‌ లో  తొలివిడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. పలామూ నియోజకవర్గంలోని కోసియారా గ్రామంలో ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి వెళ్లగా ఆయన్ను బీజేపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. 


త్రిపాఠి తన వద్ద ఉన్న గన్ చేతిలోకి తీసుకొని అక్కడి వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. గన్ బయటకు తీయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పూర్తి వివరాలను నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. 


తొలిదశ పోలింగ్‌ వేళ ఝార్ఖండ్‌లో నక్సలైట్లు అరాచకానికి పాల్పడ్డారు. పోలింగ్‌ జరుగుతున్న గుల్మా జిల్లాలోని విష్ణుపూర్‌లో ఓ బ్రిడ్జిని పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి.. ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. 13నియోజకవర్గాల్లో ఆరుకుపైగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలున్నాయి. ఈ పదమూడు స్థానాల్లో కలిపి 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒక్క భావనాథ్‌పూర్ నుంచే 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 62.87 శాతం నమోదైందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. జార్ఖండ్‌లో మొత్తం 5 విడతల్లో పోలింగ్‌ జరుగనుండగా, డిసెంబరు 23న ఫలితాలు వెలువడతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: