ఆర్టీసీ కార్మికుల విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌మ్మెకు ముగింపు ప‌ల‌కాల‌ని, ఉద్యోగాల్లో కార్మికుల‌ను ష‌ర‌తులు లేకుండా చేర్చుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా...వారితో క‌లిసి ఆత్మీయ భోజ‌నం చేస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేర‌కు ఆర్టీసీ కార్మికులతో ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు కూడా చేశారు. అయితే, ఈ స‌మావేశాన్ని ఆషామాషీగా కాకుండా ప‌క‌డ్బందీగా జ‌ర‌పాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు  ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో  సుధీర్ఘ సమావేశం జరిపారు. ఈ సమీక్షాసమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ, ఇ.డిలు తదితర ఉన్నతాధికారులు, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.

 

ఆర్టీసీ స‌మ్మె, కార్మికుల‌తో భేటీ నేప‌థ్యంలో రవాణా మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. యూనియన్ నేతల మాటలు పట్టుకోని సమ్మెకు దిగిన కార్మికులు దాదాపు రెండునెల్ల పాటు సమ్మెలో పాల్గొని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్న నేపథ్యంలో.. మానవతా దృక్పథంతో స్పందించి వారిని బేషరతుగా ఉద్యోగ అవకాశాన్ని తిరిగి కల్పించామ‌ని ఆయ‌న పేర్కొన్న‌ట్లు స‌మాచారం. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తున్న కార్మికులను తానే స్వయంగా పిలిపించుకుని వారి సాధకబాధకాలు తెలుసుకోనున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలనుంచి ఐదుగురు చొప్పున కార్మికులను పిలిపించుకుని ఆత్మీయ సంభాషణ చేస్దామ‌ని పేర్కొన్నారు. 

 

ఈ స‌మావేశం సందర్బంగా ఆర్టీసీ సంస్థ మంచి చెడుల గురించి, సంస్థను మరింత పటిష్టపరిచి అభివ్రుద్ది చేసుకోవాలంటే చేపట్టాల్సిన కార్యాచరణను వారితో చర్చించనున్నారు. ఇన్నాల్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికుల  క్షేత్రాస్థాయి అనుభవాలను  పంచుకోవడం ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేసి, నాణ్యమైన ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు  చేపట్టనున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా సమీక్షించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో సమగ్రంగా ఎటువంటి చర్చ చేయాలి...కార్మికులు సంస్థ అధికారులనుంచి ప్రభుత్వం నుంచి ఆశించే అంశాలు ఏమిటి.. అందుకు  ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాలిక చర్యలకు సంబంధించి సిద్ధ‌మై ఉండాల‌ని కేసీఆర్ కోరిన‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: