డాక్ట‌ర్ ప్రియాంక రెడ్డి దారుణ‌హ‌త్య దేశంలో మాన‌వ‌త్వం ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చి వేసిన సంగ‌తి తెలిసిందే. షాద్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో నిందితుల‌ను ఉంచిన స‌మ‌యంలో... పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు అక్క‌డికి చేరుకోవ‌డం...అందోళ‌న చేయ‌డం...భ‌గ్గుమ‌న్న హృద‌యాల స్పంద‌న‌కు నిద‌ర్శ‌నం. పోలీసులతో కొంద‌రు యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు మోహరించారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

అయితే, ప్రియాంక హ‌త్యోదంతంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు జ‌రిగాయి. తెలంగాణలో జ‌రిగిన‌ యువతి హత్య కేసుపై పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు చేపట్టారు. ఆడ పిల్లలను రక్షించాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో యువతిపై హత్యాచారానికి నిరసనగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో శారదా కళాశాల విద్యార్ధులు ర్యాలీ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో యువతి హత్యకు నిరసనగా గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నారై ఇండియన్ ప్రిన్స్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు ర్యాలీలో పాల్గొని సేవ్ గర్ల్ నినాదాలు చేస్తూ.. రోడ్లపై ప్రదర్శన చేపట్టారు. గుంటూరు నగరంలో నోటికి నల్ల రిబ్బన్లతో ర్యాలీ చేపట్టారు.చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలంటే నిందితులకు అక్కడికక్కడే శిక్షలు పడాలని నినదించారు.

 

తిరుపతిలో సైతం ఇదే రీతిలో ఆందోళ‌న‌లు సాగాయి. ప్రియాంక‌ను దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తిరుపతిలో విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం నుంచి ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు... యువతి చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణలో యువతి హత్యకు కారకులైన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ... విశాఖలో విద్యార్థి సంఘాలు, వైకాపా యువజన సంఘం కార్యకర్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: