2014 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం 2019 సంవత్సరంలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలల కాలంలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ బిల్లు, అయోధ్య తీర్పు మొదలైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ 2025 సంవత్సరం నాటికి 5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. 
 
ఆర్థిక మాంద్యం మోదీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నా మోదీ ప్రభుత్వం ఆర్థిక మాంద్యం నుండి దేశాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ ఆరు నెలల పాలన గురించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. దేశాభివృద్ధి కోసం, ఐక్యత పెంపొందించడం కోసం, సామాజిక సాధికారత కోసం గత ఆరు నెలల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మోదీ వివరించారు. 
 
ప్రధాని మోదీ తన ట్వీట్లకు 6monthsofindiafirst అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. దేశానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాలన సాగిందని మోదీ ట్వీట్ల ద్వారా చెప్పారు. ప్రగతిశీల నవభారతాన్ని తీర్చిదిద్దుతామని, భవిష్యత్తులో మరిన్ని పనులు చేస్తామని మోదీ అన్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే ధర్మ సూత్రం ఆధారంగా కొత్త ఉత్సాహంతో పని చేస్తోందని మోదీ తెలిపారు. 
 
మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం జీడీపీ వృద్ధి తగ్గడానికి కారణమని విపక్షాలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరు నెలల కాలంలో మోదీ ప్రభుత్వానికి సక్సెస్ రేటు పెరగలేదని, తగ్గలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో భారీ ఎదురుదెబ్బ తగిలిన బీజేపీ పార్టీకి రానున్న రోజుల్లో జరగబోతున్న జార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: