రెండు రోజుల నుంచి దేశ‌వ్యాప్తంగా క‌ల క‌లం సృష్టిస్తోంది ప్రియాంకా రెడ్డి హత్య కేసు. వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ అయిన ప్రియాంక‌కు ప‌ట్టిన దుస్థితి మ‌రే ఆడ‌పిల్ల‌కు రాకూడ‌దు. ఈమె కేసును చూస్తుంటే మొత్తం ప‌గ‌డ్‌బందీగా ప‌క్కా ప్లాన్ చేసి చేసిన‌ట్లు ఉంది. అంతా సినిమా స్క్రీన్‌ప్లే మాదిరిగా అనిపిస్తోంది. ఆమె బైక్ పాడ‌వడం అది బాగు చెయించ‌డానికి ఒక‌ళ్ళు రావ‌డం దాన్ని తీసుకువెళ్ల‌డం ఆమె ఓ నిర్మానుష్య చిమ్మ చీక‌ట్లో నిల‌బ‌డ‌డం అంతా ఒక గంట‌లో జరిగిపోయింది. ఆమె త‌న సోద‌రితో మాట్లాడిన ఫోన్ కాల్ డేటా వింటుంటే త‌ను ఆ స‌మ‌యంలో ఎంత భ‌య‌ప‌డింది అన్న‌ది అర్ధ‌మ‌వుతుంది. 

 

ఇక ఈ విష‌యం ఇలా ఉంచితే బాధ్యతగా ఉండాల్సిన ఇద్దరు ప్రభుత్వ అధికారుల్లో ఏ ఒక్కరు తమ విధిని సక్రమంగా నిర్వర్తించినా ప్రియాంక ప్రాణాలతో ఉండేదని తెలుస్తోంది. ప్రియాంకపై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు, కేసులో ఏ-1 నిందితుడు ఆరిఫ్, ఐరన్ ను లారీలో లోడ్ చేసుకుని తీసుకు వస్తూ, మహబూబ్ నగర్ ఆర్టీఓ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదని, లారీ ఓవర్ లోడ్ తో ఉందని గమనించి కూడా సదరు అధికారి, కేసు నమోదు చేయకుండా, లారీని సీజ్ చేయకుండా వదిలేశాడు. ఇది ఓ నిర్లక్ష్యం.

 

ఆపై లారీని హైదరాబాద్ శివార్ల వరకూ తీసుకు వచ్చిన ఆరిఫ్, దాన్ని తొండుపల్లి దగ్గర అక్రమంగా పార్కింగ్ చేశాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం, లారీ ఎందుకుందన్న విషయాన్ని పట్టించుకోకుండా, వెళ్లిపోవాలంటూ హెచ్చరించి వదిలేశారే తప్ప, చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ఘటనల్లో ఏ ఒక్కరైనా తమ పనిని సక్రమంగా నిర్వర్తించివుంటే, ప్రియాంక ప్రాణాలతో ఉండేది. ఈ విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. మ‌రి ఇలాంటి సంద‌ర్భాల్లో అధికారుల మీద కూడా ప్ర‌భుత్వం ఏమ‌న్నా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: