వెటర్నరీ డాక్టర్ ప్రియాంక‌రెడ్డి హత్యోదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మేధావులు, సామాన్యులు ఇలా అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. దేశరాజధానిలో పార్లమెంట్ గేటు వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న దుబే అనే యువతిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ సంఘాలు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహించాయి.

 

సినీ నటి అనుష్క కూడా బాధితురాలి కుటుంబానికి సానుభూతి తెలిపారు. వెటర్నరీ వైద్యురాలి ఘటన చాలా బాధాకరమని, వారి ఇంట్లో జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని సినీనటుడు అలీ అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడినవాళ్లకు మానవ హక్కులు వర్తించబోవని వైఎస్సార్సీపీ నేత రోజా అన్నారు. హీరోయిన్ పూనమ్‌కౌర్ స్పందిస్తూ... వెటర్నరీ డాక్టర్‌ను హత్యచేసినవారిని చంపి తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు కాదు చేతల్లో చూపించాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్  అలాగే యూపీ సంబల్‌లోని టీనేజ్ బాలికపై జరిగిన లైంగిక దాడి అతి క్రూరమైనవి. ఈ ఘటనలు నన్నుకలిచివేశాయి. నా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవడం లేదు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడటం కంటే మనం  చేయాల్సిందే ఎక్కువగా ఉంది‘. అని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి ఘటనలకు పుల్ స్టాప్ పెట్టాలని బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ``హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ అయినా, తమిళనాడులో లాయర్ అయినా, రాంచీలో గ్యాంగ్ రేప్ అయినా  తీరు మారడం లేదు. నిర్భయం చట్టం తెచ్చి 7 సంవత్సరాలు అయినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు కదా. ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల మనం సమాజాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి ఘటనలను మనం ఆపాలి.`` అని ఆయ‌న కోరారు.  

కాగా, చిలుకూరు బాలాజీ ఆల‌యంలో కీల‌కమైన దర్శనం నిలిపివేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైద్యురాలు ప్రియాంక‌రెడ్డి హత్యకు నిరసనగా శనివారం చిలుకూరు బాలాజీ ఆలయంలో కొద్దిసేపు దర్శనం నిలిపివేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆలయ అర్చకుడు రంగరాజన్, భక్తులు మొక్కుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: