ఆర్టీసీ కార్మికులతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆత్మీయ భోజ‌నం స‌మావేశానికి కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల నుంచి విచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని 97 డిపోల కార్మికులతో ఆదివారం ప్రగతి భవన్‌‌లోని జనహితలో లంచ్‌‌ మీటింగ్‌‌ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమావేశానికి ప్రతి డిపో నుంచి ఐదుగురిని ఆహ్వానించారు. ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలని సునీల్‌‌ శర్మను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేర‌కు అధికారులు త‌గు చ‌ర్య‌లు తీసుకున్నారు.

 

కార్మికులు వచ్చేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో...రాష్ట్రవ్యాప్తంగా డిపోల నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేందుకు అధికారులు స్వ‌యంగా సంబంధిత ఏర్పాట్లు చేశారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇప్ప‌టికే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.  కార్మికులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాళ్లతో సీఎం మాట్లాడతారు. కార్మికులు డ్యూటీలో ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అనుభవాలతో సంస్థను ఎలా బలోపేతం చేసుకోవచ్చు, నాణ్యమైన ప్రజారవాణా వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనే అంశాల గురించి కేసీఆర్ వారితో మాట్లాడ‌నున్నారు.

 

ఇదిలాఉండ‌గా, లంచ్‌‌ మీటింగ్‌‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కార్మికులతో ఏయే అంశాలు మాట్లాడాలి, వారు సంస్థ నుంచి, ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి అనే విషయాలపై శనివారం రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌‌, ఆర్టీసీ ఇన్‌‌చార్జీ ఎండీ సునీల్‌‌శర్మ, అధికారులతో సీఎం శనివారం సమీక్షించారు. ఆర్టీసీ పరిరక్షణకు చేపట్టాల్సిన ప్రణాళిక, దాన్ని కార్మికులకు సులభంగా చెప్పే తీరుపైనా చర్చించారు.

 

కాగా, సీఎంను కలిసేందుకు ఆహ్వానం అందిన కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తమపట్ల ప్రత్యేక శ్రద్ధచూపడమే కాకుండా ఏకంగా ప్రగతిభవన్‌కు పిలవటం ప‌ట్ల ఖుష్ అవుతున్నారు. అయితే, అదే స‌మ‌యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమావేశంపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ మొదలైంది. ఆర్టీసీ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సంస్థను లాభాలబాట పట్టించేందుకు ఎలాంటి ప్రణాళిక అమలుచేస్తారు? అన్న ప్రశ్నలు కార్మికుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: