హైదరాబాద్ నగరం శంషాబాద్ లోని షాద్‌నగర్‌లో ప్రియాంక రెడ్డి హత్యానంతరం 48 గంటల లోపే మరొక 35 ఏళ్ల మహిళ సజీవదహనం అయ్యి కలకలం రేపింది. ప్రియాంక హత్య జరిగిన ప్రాంతానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఈ మహిళ కాలి బూడిదై కనిపించడం గమనార్హం. అయితే ఈ మహిళా కేసును పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని... సీసీ టీవీ ఫ్యూటజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి పోలీసులకు.. ఆ మృతురాలు అప్పర్‌ ధూల్‌పేటకు చెందిన సంతోష్‌సింగ్‌ భార్య కవితాబాయి(35)గా తెలిసింది.


డీసీపీ ప్రకాష్ రెడ్డి చెప్పిన ప్రకారం.. కవితాబాయి మతిస్థిమితం సరిగాలేక కొంతకాలంగా బాధ పడుతుంది. దాంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెకు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్సను చేయిస్తున్నారు. అయితే, కొన్ని రోజులు గడిచిన తర్వాత.. తానే స్వయంగా ఆస్పత్రికి వెళ్లడం ప్రారంభించింది. ఇదే క్రమంలో.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు.. చికిత్స కోసం ఆసుపత్రికి తానే స్వయంగా వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయటికి వచ్చింది. గతంలోనూ ఆమె ఒక్కటే ఆసుపత్రికి వెళ్లి..మళ్లి తిరిగి సేఫ్ గానే ఇంటికి రావడంతో.. శుక్రవారం రోజు కూడా అదే విధంగా ఇంటికి చేరుకుంటుందని భావించారు కుటుంబ సభ్యులు. ఇంటి నుంచి బయలు దేరిన కవితాబాయి మధ్యాహ్న సమయంలో రాళ్లగూడ సమీపంలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏడుస్తూ అక్కడక్కడే తిరిగింది.


సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా ఆమె చేతిలో ఒక సంచి ఉందని.. ఆ సంచిలో కొన్ని బాటిల్ లతో సహా ఇతర వస్తువులు ఉన్నాయని పోలీసులకు తెలిసింది. అయితే కవితాబాయి తన మార్గమధ్యంలో కొంతమంది స్థానికులతో మాట్లాడుతూ కుటుంబ సభ్యుల కోసం వేచి చూస్తున్నానని చెప్పింది. శుక్రవారం మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళిన కవితాబాయి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో.. ఆమె భర్త బంధువుల ఇంటికి వెళ్లి కవితా బాయి కోసం వెతక సాగాడు. అయితే ఈ క్రమంలోనే టీవీలో వార్తలు చూసిన సంతోష్‌సింగ్‌ కు..సిద్దులగుట్ట ఫోర్టు గ్రాండ్‌ ఎదుట బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో 35 ఏళ్ల మహిళ దహనమయ్యిందని తెలిసింది. దాంతో బంధువులతో సహా సంతోష్‌సింగ్‌ శంషాబాద్‌లోని ఘటనాస్థలికి వెళ్లారు. మృతదేహం కవితాబాయిదే అని గుర్తుపట్టారు. పోలీసులు సైతం పలు కోణాల్లో పరిశీలన జరిపి నిర్ధరించారు.

కవితబాయి నిప్పంటించుకుని చనిపోయిందని... తనది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే ఆమె మృతి పై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా... కార్మికుడైన సంతోష్‌సింగ్‌కు కుమార్తెలు పూజ(15), నందిని(14), కాంచన్‌(12) ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: