కొంచెం టచ్ లో ఉంటే చెప్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు. ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ ప్రత్యర్థి పార్టీలను తెగ భయపెడుతున్నారు. అయితే ...చోటామోటా నేతలు తప్పా...బీజేపీలో చేరేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడటం లేదనే టాక్‌ వినిపిస్తోంది.

 


ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... వారికి క్షేత్రస్థాయిలో మాత్రం సరైన ఫలితాలు రావటం లేదు. నేతలు మాట ఒక రీతిలో ఆచరణలు మరో విధంగా ఉంటున్నాయి. ఏపీ నుంచి నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరటం మినహా ఇప్పటి వరకూ పెద్దగా చేరికలు ఏమీ జరగలేదు. ఆ తర్వాత కూడా రాష్ట్ర బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ చేరలేదు. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల రాయలసీమ నుంచి  బైరెడ్డి లాంటి నేతలు తప్ప కమలదళంలో పెద్దగా చేరికలు ఏమీ లేవు.

 


అయితే.. గత కొంతకాలంగా టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అయినా అవి  వాస్తవ రూపం దాల్చలేదు. విశాఖలో ఎమ్మెల్యే గంటా మాత్రం బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ సుజనా చౌదరితో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఆయన వైసీపీ కండువా కప్పుకుంటానని ప్రకటించారు. ఈ లోపు సుజనా చౌదరి..  వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైసీపీ ఎంపీలు సుజనా వ్యాఖ్యాలపై తమదైన శైలిలో రెచ్చిపోయినా నోరు మెదపని పరిస్థితి సుజనాది. అయితే ఏపీలో క్షేత్ర  స్థాయిలో మాత్రం అధికార వైసీపీని టార్గెట్ చేసి ఆందోళనలు చేస్తోంది బీజేపీనే. ప్రతిపక్ష టీడీపీకి పోటీగా ప్రస్తుతం బీజేపీ ఆందోళనలను ఉద్ధృతం చేస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీ  వైఖరిపై నిరసనలు చేపడుతోంది.

 

మరోవైపు...ఏపీలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరిపైనా ఆధారపడకుండా  సొంతంగా ఎదుగుతుందని ఆ పార్టీ నేత రాంమాధవ్ ఇటీవలే చెప్పారు. ఈ  నేపధ్యంలో పార్టీ బలోపేతానికి సంబంధించి బలమైన నేతల కోసం కమల దళం అన్వేషిస్తోంది. ఏపీలో అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి అసెంబ్లీలో ఒక్క సీటు  కూడా లేని పరిస్థితుల్లో బీజేపీ ఉంది. ఒకవైపు నేతలు టచ్ లో ఉన్నారని చెబుతున్నా చేరికలు ఉండకపోవటంలో ఇరకాటంలో పడుతున్నామని పార్టీ నేతలు భావిస్తున్నారట. దీంతో ఈసారి పార్టీకి ఎస్సెట్ గా మారే నేతల చేరికపై గుంభనంగా వ్యవహరించాలని చూస్తున్నారట. బీజేపీ నేతలు ప్రస్తుతం అలాంటి ఆలోచనలే చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో కమలదళం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: