దేశవ్యాప్తంగా మత్తుపదార్థాల రవాణా, వినియోగం విస్తరిస్తోంది.ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో మత్తు పదార్ధాల వినియోగం పెరుగుతోందన్న నివేదికలతో  పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పుడు ఏకంగా సీఐడీ రంగంలోకి దిగడం సంచలనం సృష్టిస్తోంది.

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెరిగిపోతున్న మత్తు పదార్థాల వినియోగం పోలీసులకు సవాల్ విసురుతోంది. రాజధానితో పాటు 13జిల్లాల్లో మత్తు పదార్దాల వినియోగం,రవాణా వ్యవహరాలు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. నూతన రాజదాని ప్రాంతం కావడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విదేశీయులు ఎక్కువగా రాకపోకలు సాగించడం, చదువు పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు  వచ్చి నివసిస్తుండడంతో.. చాటుగా మత్తు పదార్దాల రవాణా, వినియోగం విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.ప్రధానంగా గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో మత్తు పదార్దాల రవాణా అధికంగా జరుగుతోంది. 

 

ఇందులోనూ గంజాయి వినియోగం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రాజధాని ప్రాంతంలో గంజాయితో పాటు , వైట్‌నర్ లాంటి పదార్ధాలను సైతం విద్యార్థులు ఆశ్రయిస్తున్నారు. మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన ఘర్షణ వ్యవహారంలో ఈ ఘటన వెలుగుచూసింది. మత్తు పదార్దాలను సేవించిన విద్యార్దులు ఏకంగా అధ్యక్షుడిపైనే దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు.. విద్యార్థులు రక్తనమూనాలను సేకరించి,పరీక్షలకు పంపారు. ఈ ఫలితాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. 


 
స్థానిక మందుల దుకాణంలో కొనుగోలు చేశారని తెలుసుకున్న పోలీసులు.. యజమానిపై కేసు పెట్టారు. మరోవైపు.. టోల్ గేట్ కేంద్రంగా గంజాయి రవాణా అధికంగా జరుగుతోంది. పలుమార్లు పోలీసులు రవాణాదారులను అరెస్ట్ చేసినప్పటికీ.. వారు విడుదలై తిరిగి వచ్చి అక్రమ రవాణ సాగిస్తున్నారు. విజయవాడలో పోలీసులు.. డ్రగ్స్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. గంజాయితో పాటుగా ఇతర మత్తుపదార్థాలను వినియోగిస్తున్న విదేశీ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనం సృష్టించింది. వీరంతా తాడేపల్లి ,ఉండవల్లి లో ఇళ్ళను అద్దెకు తీసుకొని ఉంటూ చదువు పేరుతో మత్తుకు అలవాటు పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

 

గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో విదేశీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్న షాజీ నుంచి గంజాయితో పాటుగా తెల్లరంగు పౌడర్ ను స్వాదీనం చేసుకున్నారు. ఏపీ కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్దాల రవాణా పై డీజీపీ సవాంగ్ ..ప్రత్యేకంగా సీఐడీ ఆద్వర్యంలో నార్కోటిక్ సెల్ ను రంగంలోకి దించారు. వాట్సాప్ నెంబర్ ను కూడ విడుదల చేశారు.మత్తు పదార్దాల రవాణా పై ఫిర్యాదు చేయాలనుకునే వారు,73822 96118 నెంబర్ కు వాట్సాప్ చేయాలని సూచించారు. మత్తుపదార్థాలపై యుద్ధం ప్రకటించిన ఏపీ పోలీసులు, సీఐడీ.. రవాణ, వినియోగాన్ని అరికట్టేందుకు శ్రమిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: