లీటర్ పాలు ఎంతమంది తాగొచ్చు... మనిషి వంద మిల్లీ లీటర్ల చొప్పున వేసుకుంటే.. పది మంది ఒక లీటర్ పాలు తాగుతారు. కానీ...యూపీలో ఒక లీటర్ పాలు ఎంతమంది తాగారో తెలుసా... 81 మంది.  రెండు బకెట్ల నీళ్లల్లో లీటర్ పాలు కలపి స్కూలు పిల్లలకు ఇచ్చిందో ప్రబుద్ధురాలు. మొన్నటికి మొన్న మీర్జాపూర్‌ లోని ఓ ప్రైమరీ స్కూలులో చిన్నారులకు రొట్టెలు, ఉప్పు పెట్టిన ఘటన మరువకముందే.. మరో నిర్వాకం ఇప్పుడు బయటపడింది. 

 

యూపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అపహస్యం చేస్తున్నారు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం. సొంత లాభం కోసం చిన్నారుల కడుపు కొడుతున్నారు. పేద చిన్నారులకు మధ్యాహ్న భోజనం కింద అన్నం, పప్పు, రొట్టె, కూరగాయలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే సోన్‌భద్ర జిల్లా చోపన్‌ లోని  ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్కడి వంట మనిషి చిన్నారులకు ఇచ్చే పాలల్లో అధిక మొత్తంలో నీరు కలిపి అందించింది. 

 

ఈ పాఠశాలలో 171 మంది విద్యార్థులుండగా.. బుధవారం 81 మంది హాజరయ్యారు.  విద్యార్థులకు పాలు పంపిణీ చేస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు అక్కడికి వెళ్లారు. పెద్ద అల్యూమినియం పాత్రలో వేడి నీళ్లలో లీటరు పాలు కలిపి దాదాపు 81 మంది పిల్లలకు ఇవ్వడాన్ని గమనించారు. ఈ తతంగాన్నంతా వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

 

సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. స్కూల్‌కు ప్రతిరోజూ అవసరమైన మేర పాలు అందజేస్తున్నామని సమర్ధించుకుంది. అయితే ఆ వంట మనిషి మాత్రం తమకు బుధవారం ఒక లీటర్‌ పాలు మాత్రమే ఇచ్చారని, ఏం చేయాలో తెలియక అలా నీరు కలిపి పిల్లలకు పంచానని చెబుతోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో మేల్కొన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు  దర్యాప్తునకు ఆదేశించామని, ఇకపై పొరపాట్లు జరగకుండా చూస్తామని సర్ధి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: