కర్ణాటకలో రాజకీయాల వేడి ఇంకా చలారనట్లు ఉంది. ఎందుకంటే డిసెంబర్‌ 5న జరిగే ఉపఎన్నికల పోరుకు ఇప్పటినుండే రాజకీయ పార్టీలు ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ప్రణాళికలను సిద్దం చేస్తుకుంటున్నాయి. ఇకపోతే ఈ సందర్భంగా మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవేగౌడ కర్ణాటక ఉపఎన్నికల అనంతరం భాజపా ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెలిపారు. శనివారం ఓ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

 

 

డిసెంబర్‌ 5న జరిగే ఉపఎన్నికల అనంతరం యడ్యూరప్ప ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చేది లేదన్నారు. ఇదేవిధంగా తమ పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇకపోతే రెండు జాతీయ పార్టీల స్వభావం ఒకటేనని అందువల్ల వాటికి దూరంగా ఉండటమే మేలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం కుమారస్వామి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఉప ఎన్నికలు మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు అవసరమైతే భాజపాకు మద్దతు ఇస్తామని అన్నారు.

 

 

ఇక కుమారస్వామి అన్న వ్యాఖ్యలపై దేవేగౌడను ప్రశ్నించగా.. ‘ఒకవేళ మీడియా చెప్పింది నిజమే అయినా  కుమారస్వామి ఏ సందర్భంలో ఆ ప్రకటన చేశాడో నాకు తెలియదు’ కాబట్టి ఆవిషయంలో ఏం చెప్పలేను అని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం 15 స్థానాల్లో జరగబోయే ఉపఎన్నికల్లో తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైతే తప్పనిసరిగా ప్రభుత్వం నిలబడడానికి జేడీఎస్‌ మద్దతు అవసరం. కానీ అదే సమయంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలవనంత వరకు భాజపా ప్రభుత్వానికి ముప్పు లేదు. అయినా ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌ ప్రణాళిక ఏమిటనేది కూడా నాకు తెలియదు’’ అని తెలిపారు.

 

 

ఇకపోతే జులైలో కర్ణాటక శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో 15 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఎన్నికల సంఘం ఆయా స్థానాల్లో ఉపఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్‌ వెలువరించగా, సుప్రీం కోర్టు కూడా అనర్హులుగా ప్రకటించిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తీర్పు వెలువరించడంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు భాజపా తరఫున బరిలో నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: