తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. 52 రోజుల పాటు జ‌రిగిన‌ సమ్మెకు ముగింపు ప‌లికిన‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...నేడు ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనాల అనంతరం కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారికి వరాలు కురిపించారు. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతున్న‌ట్లు నిర్ణయం వెలువ‌రించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులకు  మరో రెండేళ్లు అదనంగా సర్వీసులో ఉండే అవకాశం రాబోతోంది. సెప్టెంబర్ నెల జీతం కూడా సోమవారంలోగా చెల్లించాలని ఆదేశం ఇచ్చిన‌ట్లు కేసీఆర్ తెలిపారు. సమ్మె చేసిన 52 రోజుల కాలానికి జీతం కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ కండ‌క్ట‌ర్ల‌కు తీపి క‌బురు తెలిపారు. ప్రయాణికులు టిక్కెట్ తీసుకోకపోతే కండక్టర్లకు విధిస్తున్న జరిమానాను ఇకపై ప్రయాణికుల నుంచే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు బస్సుల్లో ప్రయాణికులు టికెట్ తీసుకుండా ప్రయాణిస్తూ స్క్వాడ్‌కు పట్టుబడితే దానిలో కండక్టర్‌కు జరిమానా పడేది. ఈ నిబంధనను కూడా మారుస్తామని సీఎం కేసీఆర్ కార్మికులకు తెలిపారు. రేపటి నుంచే కండక్టర్‌కు బదులు ఆ ఫైన్ ప్రయాణికులపై వేస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. కాగా,  డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పించాలని అధికారుల‌కు కేసీఆర్ సూచించారు.

 

మ‌రోవైపు ఆర్టీసీ మనుగడ కోసం కష్టపడి పని చేయాలని, సంస్థను అభివృద్ధిలో తేవాలని కేసీఆర్‌ సూచించారు. మంచి ఫలితాలు సాధిస్తే సింగరేణి కార్మికుల మాదిరిగా బోనస్ ఇస్తామని చెప్పారు. కార్మికులు ఏటా లక్ష రూపాయల బోనస్ తీసుకునేలా పనియేయాలని అన్నారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరిన తర్వాత వారితో సమావేశమవుతానని గత క్యాబినెట్ సమావేశానంతరం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ మాట ప్రకారం వారిని ప్రగతిభవన్‌కు పిలిపించుకొని కూలంకషంగా మాట్లాడట‌మే కాకుండా....కీల‌క అంశాల‌పై భ‌రోసా ఇవ్వ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: