రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్న తీరున కధ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ దేశంలో చావు అయినా, పెళ్ళి అయినా కూడా దాని నుంచి కూడా రాజకీయాలకు వాడేసుకుంటారు. ఇపుడు ప్రియాంకారెడ్డి దారుణాన్ని సైతం రాజకీయానికి వాడుకోవాలనుకోవడమే బాధాకరం. దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన ఈ కేసు విషయంలో ఇప్పటి వరకూ స్పందించకుండా  ఉన్నది కేసీయారేనని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీయార్ ఎక్కడా పెదవి విప్పలేదని చెబుతున్నారు. 

 

ఇక ఆయన కుమారుడు, మంత్రి అయిన కేటీయార్ సైతం బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి కనీస పరమర్శ చేయలేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. దాంతో పాటు ఈ కేసులో కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఉందందన్న వాదన కూడా ఉంది. నగర శివారులో జరిగినా ఈ ఘటన నిర్భయ కేసుని మించిపోయిందని అంటున్నారు. జాతీయ మహిళా కమిషన్ అయితే తెలంగాణా పోలీసులను తప్పుపట్టింది.

 

కేసీయార్ సర్కార్ శాంతిభద్రతలో విఫలం అయిందని బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నుంచి మహిళా నేత డీకే అరుణ తెలంగాణాలో మహిళలకు అసలు రక్షణ లేదని అన్నారు. పోలీసులు మహిళల భద్రతను గాలికి వదిలేశారని కూడా అన్నారు. మరో వైపు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అయితే మహిళల విషయంలో కేసీయార్ సర్కార్ చెప్పేది ఒకటి చేసేది వేరొకటి అన్న చందంగా వ్యవహరిస్తోందని కూడా దుమ్మెత్తిపోశారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే కేంద్ర మంత్రి జి కిషన్  రెడ్డి బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అదే విధంగా తెలంగాణా గవర్నర్ తమిల్ సై సైతం ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని పలకరించి ఓదార్చారు. ఇంత జరిగినా కూడా కెసీయార్ కుటుంబం నుంచి ఒక్కరూ ఆ ఇంటి గడప తొక్కకపోవడంపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే చట్టాలను మారుస్తామని, రేపులు చేసే వారికి ఉరి ఖాయం చేయాలంటూ కొత్త చట్టాలను తీసుకువస్తామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

 

అదే సమయంలో పార్లమెంట్ లో దీని మీద చర్చిస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అంటున్నారు. మహిళల కోసం చట్టాలలో మార్పులు అవసరమని ఆయన అన్నారు. ఇక ఇంకో వైపు కేటీయార్ సైతం దీని మీద ప్రధాని మోడీకి లేఖ రాశారు. నిర్భయ కేసులో ఇంతవరకూ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇపుడు ఇంకా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

 

ఇలా ఇరకాటంలో పడిన టీయారెస్ ప్రధానికి లేఖ రాయడం ద్వారా చట్టాల్లో  లొసుగుల వల్లనే నేరాలు జరుగుతున్నాయని అంటోంది. అయితే పోలీసుల వైఫల్యాన్ని మాత్రం టీయారెస్ సర్కార్ అంగీకరించడంలేదు. రాత్రి తొమ్మిది గంటలకు కూడా నగరంలో మహిళలకు అడవుల్లో ఉన్నట్లుగా పరిస్థితి ఉండడం పట్ల మాత్రం మాట్లాడడంలేదు. ఇలా ఒక రాజకీయ పార్టీ వేరొక పార్టీని కౌంటర్ చేయడమే తప్ప మహిళల భద్రతకు తాము కచ్చితంగా ఏ రకమైన చర్యలు చేపడతాము అన్నది మాత్రం ఆలోచన చేయడంలేదని మహిళా సంఘాలు అంటున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: