తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు ఆర్టీసీ కార్మికుల విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌ల చేశారు. ఏక‌కాలంలో ఆర్టీసీ కార్మికుల‌కు తీపిక‌బురు ఇస్తూ అదే స‌మ‌యంలో ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు షాకిచ్చారు. ఆర్టీసీ కార్మికుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా వారికి కీల‌క హామీలు ఇచ్చారు. ప‌లు అంశాల్లో భ‌రోసా ఇచ్చారు. అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల‌కు పిలుపునిచ్చారు. సమిష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్పూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. 

 

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పాత అనుభ‌వాల‌ను వివ‌రించారు. తాను రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాట పట్టించానని కేసీఆర్ చెప్పారు. నేటికీ తనకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉందని అన్నారు. ఆర్టీసీని బతికించడానికి ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలన్నారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీ సర్వే చేయాలని చెప్పారు. ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని ప్రకటించారు.

 

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులకు కేసీఆర్‌ షాకిచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతీ నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరతామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతీ రెండు నెలలకోసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని, రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన పక్షంలో  రోజుకు గంటో , అరగంటో ఎక్కువ పనిచేయాలని ముఖ్యమంత్రి కోరగా, కార్మికులు అంగీకరించారు. కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఎమ్మెల్యేలు ఆచ‌రిస్తారా? ఒక‌వేళ ఆచ‌రిస్తే..సానుకూల మార్పుల‌కు ఇది నాంది ప‌లికినట్లేన‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: