ప్రియాంక రెడ్డి మృగాళ్ల దాష్టీకానికి  ప్రాణాలు కోల్పోవటాన్ని ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హత్యోదంతాన్ని తలచుకుని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. పరామర్శల పేరుతో పలువురు నేతల తాకిడికి వారు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. చనిపోయిన తమ కుమార్తెను ఎవరూ తిరిగి తీసుకురాలేరని, దయచేసి తమను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని ప్రియాంకా తల్లిదండ్రులు.. రాజకీయ నేతలు, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.  

 

షాద్ నగర్ లోని ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులు పరామర్శలకు విసిగివేసారి పోతున్నారు... తమ ఇంట్లోకి ఎవరూ రాకుండా లోపల నుంచి గేటుకు తాళం వేసుకున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి.. సరైన న్యాయం జరిగితే చాలని, ఎవరి సానుభూతి అవసరం లేదని పేరెంట్స్ స్పష్టం చేశారు. తమ వేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరూ రావద్దని కోరిన ప్రియాంక పేరెంట్స్..తమకు  న్యాయం మాత్రమే కావాలి అంటూ కుటుంబ సభ్యులు బోర్డ్ పెట్టారు. ప్రియాంక ఘటనపై ప్రధానమంత్రితో సహా ముఖ్యమంత్రి స‍్పందించాల్సి ఉందన్నారు పేరెంట్స్. సానుభూతి, పరామర్శల పేరుతో తాము విసిగిపోయామని... ఎవరు వచ్చినా తమకు చేసేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

ఉదయం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించటానికి వచ్చిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిని గేట్ వద్దే అడ్డుకున్నారు కాలనీ వాసులు. అనంతరం ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆమె ఇంటికి సీపీఐ కార్యదర్శి చాడ  వెంకటరెడ్డి, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి  వచ్చారు. అయితే కాలనీ వాసులు ఇంటి గేటుకు తాళం వేశారు. తాళం తీయడానికి  స్థానికులు నిరాకరించడంతో  చేసేదేమీ లేక.. లెఫ్ట్‌ పార్టీ నేతలు గేటు బయటే బైఠాయించి ధర్నా చేశారు.  లెఫ్ట్ నేతల వచ్చి వెళ్లిన తర్వాత ప్రియాంక ఇంటికి రేవంత్  రెడ్డి వెళ్లే సమయానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరూ రావొద్దంటూ స్థానికులు ఇంటి గేటుకు తాళాలేశారు. దాంతో పోలీసులు.. స్థానికులకు సర్దిచెప్పి, రేవంత్ రెడ్డిని లోపలకు పంపించారు. సైబరాబాద్ డీసీపీ ఆఫీసు కూతవేటు దూరంలో దారుణం జరగడానికి పోలీసు వైఫల్యమే కారణమని మల్కాజ్ గిరి  ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  


ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బలియన్ పరామర్శించారు. వెటర్నరీ డాక్టర్ గా వచ్చానని చెప్పిన కేంద్రమంత్రి, సమాజంలో ఈ పరిస్థితికి అంతా సిగ్గు పడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని, త్వరగానే శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను మార్చాలని తెలంగాణ కాంగ్రెస్  వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా డిమాండ్ చేసారు. పోలీసులు, ప్రభుత్వం వైఫల్యమే ప్రియాంక హత్యోదంతం జరిగిందని  మండిపడ్డారు.. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించిన కుంతియా,  నేషనల్ హైవే పై మద్యం  దుకాణాలు అనుమతించొద్దని కోరారు. ప్రియాంక కుటుంబాన్ని మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్ష కుమార్ పరామర్శించారు. ఆమె పై జరిగిన దాడి దారుణమని.. మరే మహిళలకు అన్యాయం జరక్కుండా ప్రభుత్వాలు చర్యలు తీలుకోవాలని డిమాండ్ చేసారు. వేర్వేరు నెంబర్లు కాకుండా.. కామన్ కాల్ నెంబర్ ఉండాలని సూచించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: