వెటర్నరీ డాక్టర్ ప్రియంకారెడ్డి దారుణ అత్యాచారం, హ‌త్య‌ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తుంది. మాన‌వ మృగాల చేతిలో క‌న్నుమూసిన‌ ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటుగా పలువురు బాలీవుడ్,టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ గ‌లం వినిపించారు. అయితే, దీనిపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కు రియాక్ట్ కాలేదు. దీనిపై జాతీయ మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. దేశం మొత్తం గ‌గ్గోలు పెడుతున్న ఘ‌ట‌న‌పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. 

 

అయితే, ఈ ఉదంతంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా స్పందించారు. ఆర్టీసీ కార్మికుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సమావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనాల అనంతరం కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ అంశాల‌ను వివ‌రించారు. అనంత‌రం ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి, తీవ్ర ఆవేదన చెందారు. 

 

మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కలత చెందారు. ఇది దారుణమైన అమానుషమైన దుర్ఘటన అని ఆయ‌న  ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌టీసీ మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. రాత్రి 8 గంట‌ల అనంత‌రం కండ‌క్ట‌ర్లు విధుల నుంచి విముక్తి కావాలన్నారు.

 

ఇదిలాఉండ‌గా, ప్రియాంక రెడ్డి హత్యాచారం నేపథ్యంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల పైన కఠిన చట్టాల కోసం పార్లమెంటులో ఒక రోజుపాటు చర్చించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. దేశంలో  జరుగుతున్న అత్యాచారాల్లో నిందితులు పట్టుబడిన్నప్పటికీ, వారికి వేసిన శిక్షల అమలులో తీవ్ర ఆలస్యం జరుగుతున్నదని, ఏడు సంవత్సరాల క్రితం నిర్భయ హత్యాచార ఘటనలో నిందుతులకి ఇప్పటికిీ ఉరిశిక్ష అమలు జరగడం లేదన్నారు. తొమ్మిది నెలల పసి పాప పై అత్యాచారం చేసిన నిందితుల ఉరి శిక్షను కోర్టు జీవితఖైదుగా మార్చిన సంఘటనను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: