లోక్ సత్తా పార్టీ నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వాహనం హైదరాబాద్ లో ప్రమాదానికి గురైంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో జయప్రకాశ్ నారాయణ్ సురక్షితంగా బయట పడ్డారు. జయప్రకాశ్ నారాయణ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా జూబ్లీ చెక్‌ పోస్ట్ వద్ద సిగ్నల్ పడటంతో ఆయన ప్రయాణిస్తున్న కారు అక్కడ ఆగింది. 

 

 

ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. కారు టైరు పేలిపోయింది. కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడగా, ఆటోలోని మహిళలకు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో జూబ్లీ చెక్‌ పోస్ట్ వద్ద అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఈ ప్రమాదంలో లోక్‌ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ సురక్షితంగా బయట పడ్డారు.

 

 

ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. రోడ్డు మధ్యలో ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో జేపీతో పాటు వైబీఐ అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది.

 

 

ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ సిగ్నల్ పడిన విషయం గమనించకుండా వేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అసలు కారణాలు గురించి ఆరా తీస్తున్న పోలీసులు.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: