తెలంగాణ రాష్ట్రంలో 55 రోజుల పాటు సాగిన సమ్మె పై మొదటి నుంచి కఠినంగా వ్యవహరించిన సీఎం కెసిఆర్ చివరికి సానుకూలంగా స్పందించి కార్మికులు తమ బిడ్డలు అని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కెసిఆర్ మూవ్ ను అస్సలు ఊహించని వారు 'కెసిఆర్ రూటే సెపరేట్' అంటున్నారు. సమ్మె పై నిర్ణయం తీసుకున్న రోజున, డిసెంబర్ 1 వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసి డిపోల కార్మికులని కలసి స్వయంగా మాట్లాడుతానని సీఎం ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్టీసి కార్మికులతో ఒక్కో డిపో నుంచి ఆరుగురు కార్మికులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు. 

 

ఆర్టీసి కార్మికులను వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక సీఎం లా కాకుండా స్నేహితుడిలా ప్రతీ కార్మికున్ని పలకరించి వివరాలు తెలుసుకున్నారు. ఇక సమావేశంలో ఆర్టీసీ కార్మికుల పై వరాల జల్లు కురిపించారు సీఎం. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాలనుండి 60 సంవత్సరాలకు పెంచారు. ఇంతవరకు చెల్లించని సెప్టెంబర్ నెల జీతాలు రేపటిలోగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసి సంస్థ బలోపేతం కోసం ప్రతీ ఏడాది బడ్జెట్లో రూ 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మహిళా కండక్టర్ల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం, మహిళా కండక్టర్ల కు రాత్రి 8 గంటలు దాటిన తరువాత డ్యూటీలు వేయొద్దని అధికారులను ఆదేశించారు. మహిళా కండక్టర్లకు యూనిఫామ్ నుంచి మినహాయింపు ఇచ్చారు, ఇకపై మహిళా కండక్టర్లు తమకు ఇష్టమైన డ్రెస్ లో విధులకు హాజరు కావొచ్చని స్పష్టం చేశారు.అలాగే ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసి కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.చనిపోయిన వారికి రూ 2 లక్షల ఎక్స్ గ్రేషియా, మృతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉద్యోగం ఇస్తామని చెప్పారు.

 

ఇక యూనియన్ల గురించి అడిగి తెలుసుకున్న సీఎం, కార్మికులను తప్పు దారి పట్టిస్తున్న యూనియన్లు ఉండబోవు అని ప్రకటించారు. వచ్చే రెండేళ్ళ వరకూ ఆర్టీసి గుర్తింపు యూనియన్లకు ఎన్నికలు నిర్వహించేదిలేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసి యూనియన్ల నేతలకు ఉన్న రిలీఫ్ డ్యూటీ ని ఎత్తివేయడంతో అశ్వథామరెడ్డి కూడా విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. కార్మికులపై వరాల జల్లు కురిపించిన సీఎం కెసిఆర్ యూనియన్లను మాత్రం కనికరించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: