తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల మ‌న‌సు గెలిచార‌ని అంటున్నారు. స‌మ్మె విర‌మ‌ణ అనంత‌రం ఆర్టీసీ కార్మికులతో  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్ ఆ మేర‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వారితో స‌మావేశం అయ్యారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనాల అనంతరం కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. అనంత‌రం వారితో మాట్లాడుతూ...కీల‌క హామీలు ఇచ్చారు, ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపారు. ఇందులో అడిగిన‌వి కొన్ని...అడ‌గ‌నివి కొన్ని ఉండ‌టంతో...ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

 

వ్య‌క్తిత‌, వృత్తి సంబంధ‌మైన అంశాల‌ను సైతం ఈ స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌స్తావించారు. ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో భోజనం చేసే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రైవర్లు , కండక్టర్ల తో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు . సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు. సీఎం కేసీఆర్‌కు ఎంతో చొరవగా తమ కష్ట సుఖాలను చెప్పుకున్నారు. వెంట‌నే ఆయ‌న వాటిని ప‌రిష్క‌రించారు. మహిళా ఉద్యోగులకు నైట్‌ డ్యూటీలు వేయొద్దని, రాత్రి 8 గంటలకు మహిళలు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు నిర్దేశం చేశారు. `ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, డ్రెస్‌ చేంజ్‌ గదులు, లంచ్‌ గదులు ఏర్పాటు చేయాలి. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 3 నెలలపాటు చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ మంజూరు చేస్తం. మహిళలకు ఖాకీ డ్రెస్‌ తొలగిస్తం. మహిళలకు ఇష్టమైన రంగులో యూనిఫామ్‌ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం` అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ మాట‌ల‌కు మ‌హిళా కార్మికులు హ‌ర్ష‌ద్వానాల‌తో సంతోషం వ్య‌క్తం చేశారు. 

 

ఇక మొత్తంగా కార్మికుల గురించి కూడా సీఎం కేసీఆర్ కీల‌క హామీలు, ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్దతికి స్వస్థి పలికి అందరినీ ఉద్యోగులు అనే పిలవాలని  అన్నారు. సమ్మెకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి 8 రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తామని, ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తామన్నారు. 

 

 

ఆర్టీసిని బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలని సీఎం కార్మికులకు సూచించారు. సింగరేణి కార్మికుల మాదిరిగా ప్రతీ ఏటా బోనస్ లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని సీఎం చెప్పారు.  ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణంలో సాగిందని ఆర్టీసీ కార్మికులు స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: