గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి భిన్నంగా త‌మ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని, గ‌త ప్ర‌భుత్వంలో మాదిరిగా.. మం త్రిని డ‌మ్మీ చేయడం, సీఎం ఆయ‌న ఇష్టులే నిర్ణ‌యాలు తీసుకున్న విధంగా త‌మ ప్ర‌భుత్వంలో ఎప్ప‌టికీ ఉండ‌బోద‌ని సీఎంగా ప్ర‌మాణం స్వీక‌రం అనంతరం త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న స‌మ‌యంలో వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయ‌న దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? గ‌త చంద్ర‌బాబు పాల‌న మాదిరిగానే.. వివిధ శాఖ‌ల‌పై జ‌గ‌న్ కూడా నిఘా పెట్టారా? ఆయా శాఖ‌ల‌కు సంబంధించి ఆయా మంత్రులు తీసుకోవాల్సిన నిర్ణ‌యాలు కూడా ఆయ‌నే తీసుకుంటు న్నారా?

 

ఇప్పుడు ఇదే త‌ర‌హా చ‌ర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉ న్న ఓ మీడియాలో ఈ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో నిజంగానే జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రులు డమ్మీ అయ్యారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.  వాస్త‌వానికి గడిచిన ఆరు మాసాల జ‌గ‌న్ పాల న‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న ఏ ఒక్క శాఖ‌కు సంబంధించి కూడా కీల‌క నిర్ణ‌యాలను స్వ‌యంగా ప్ర‌క‌టించింది లేదు. అంతేకాదు, ఆయా శాఖ‌ల‌పై ఆయ‌న ప‌ట్టున్న‌ప్ప‌టికీ.. సీఎంగా ఆయ‌న‌కు అధికారం ఉన్న‌ప్ప‌టికీ.. స్వ‌యంగా వేలు పెట్ట‌డం, సొంత‌గా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

 

అంతేకాదు, అస‌లు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కాని విధంగా విధిగా నెల‌కు రెండు సార్లు మంత్రు లంద‌రూ స‌మావేశ‌మై(కేబినెట్ భేటీ) ఆయా శాఖ‌ల ప‌నితీరును చ‌ర్చించాల‌నే నిబంధ‌నను తొలిసారిగా జ‌గ‌నే ప్ర‌వేశ పెట్టారు. అమ‌లు కూడా చేస్తున్నారు. అంతేనా, ఏ శాఖ మంత్రి కూడా ప‌క్క‌నున్న శాఖ‌లోకి వేలు పెట్ట‌రాద‌ని కూడా ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులు త‌మ త‌మ శాఖ‌ల ప‌రిధుల‌ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌డం లేదు.

 

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా ఒక శాఖ‌కు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించాల‌న్నా.. ఆ శాఖ మంత్రికే బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు త‌ప్ప త‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించిన సంద‌ర్భం ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌దు. సో.. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గంపై నిఘా పెట్టినా..(అంటే అవినీతి విష‌యంలో) పాల‌నా విష‌యాల్లో మాత్రం ఆయ‌న ఎక్క‌డా జోక్యం చేసుకోవ‌డం లేదు. మంత్రుల‌కు పూర్తి స్వేచ్చ‌ను ఇచ్చార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: