ఊహించని మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల్లో సీఎంగా జగన్ మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకెళుతున్నారు. మొత్తం మీద చెప్పుకోవాలంటే ఆరు నెలల్లో సీఎం జగన్ వన్ మ్యాన్ షో చేశారు. మొత్తం తన భుజాల మీద ప్రభుత్వాన్ని నడిపించారు. అయితే జగన్ కు మంత్రుల సహకారం కూడా బాగానే అందింది. ఆరు నెలల్లో చాలానే మంది మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించుకుని మంచి పని తీరు కనబరిచారు. అయితే కొంతమంది మంత్రులు అంతగా రాణించలేదనే చెప్పాలి. వీరు ఈ ఆరు నెలల్లో పెద్ద హైలైట్ కాలేదు.

 

ముఖ్యంగా రాయలసీమ మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగతా మంత్రులు ఈ ఆరు నెలల్లో పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదనే భావన ఉంది. వారు మంత్రులనే సంగతి పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పొచ్చు. రాయలసీమలో మొత్తం ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఇందులో ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కడపలో డిప్యూటీ సీఎం అహ్మద్ బాషా,అనంతపురంలో మాలగుండ్ల శంకర నారాయణ, కర్నూలులో గుమ్మనూరు జయరాంలు ఉన్నారు.

 

వీరిలో పెద్దైరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ కాబట్టి ఆయన అందరికీ తెలుసు. అయితే పెద్దిరెడ్డి వెనుక ఉండి వ్యూహాలు రచించడంలో ముందు ఉన్నారుగానీ, బయట మీడియాలో పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. అయితే ఆయన పనితీరు పట్ల ఎలాంటి వంక పెట్టడానికి కూడా లేదు. ఇక చిత్తూరులో ఉన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ మధ్యే కాస్త మీడియాలో హైలైట్ అవుతున్నారు తప్ప...మొదట్లో ఆయన గురించి ప్రజలకు కూడా సరిగా తెలియదు.

 

ఇటు అనంతపురం మంత్రి శంకర నారాయణ అయితే ఇప్పటికీ కనబడటం లేదు. అటు పనితీరులో కూడా ఈయన అంత మంచి మార్కులు దక్కించుకోలేదనే తెలుస్తోంది. కర్నూలులో జయరాం పర్వాలేదానిపిస్తున్నారు.  కాకపోతే అనుకున్న స్థాయిలో మాత్రం జయరాం పేరు తెచ్చుకోలేదు. ఇక కడపలో అహ్మద్ బాషా కూడా ఈ ఆరు నెలల్లో పెద్దగా హైలైట్ కాలేదు. మొత్తానికి సీమ మంత్రులు కాస్త వెనుకబడి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: