తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఊహించ‌ని వివాదంతో తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టీటీడీ వెబ్‌సైట్‌లో క్రైస్త‌వ‌మ‌తానికి సంబంధించిన కంటెంట్ దర్శనమిచ్చిందంటూ టీడీపీ నేత‌,  బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య  ఆరోపించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్‌ చేయడం.. పవిత్ర తిరుమల దేవాలయంపై మంత్రుల ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు వంటివి చేయ‌డం ద్వారా కోట్లాది హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను, ఆగమ శాస్త్ర విలువలను మంటగొలిపేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అయితే, దీనిపై టీటీడీ కౌంట‌ర్ ఇచ్చింది. 

 

రాజ‌కీయ కుట్రలో భాగంగానే టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక  ప్రచురణ చేయడం దురదృష్టమని పేర్కొన్నారు. తిరుమ‌ల‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా తిరుమలలోని ఏడు కొండలపై సిలువ గుర్తు ఉందంటూ, బస్సు టికెట్ లో ఇతర మతాల గుర్తులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేసారని మండిపడ్డారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆక్షేపించారు. కుట్రలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామ‌ని, టీటీడీని భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్ప‌ష్టం చేశారు.

 

 

ఇతర మతాలు గుర్తులున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్న ఉదంతంపై గూగుల్ కంపెనీని వివరణ కోరామ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వివాదానికి కారణమైనవారిపై క్రిమినల్ కేసులు పెడతామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. టీటీడీకి సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు అవ‌కాశం ఇవ్వాలని సీఎంను కోరుతామ‌ని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. టీటీడీ ఈవో సింఘాల్  మాట్లాడుతూ...టీటీడీలో ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ గూగుల్ సెర్చ్‌లో మాత్ర‌మే క‌నిపిస్తోంద‌ని టీటీడీ వెబ్‌సైట్‌లో లేదని స్ప‌ష్టం చేశారు. టీటీడీ పంచాంగంలో శ్రీయైనమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫ్ లో ఉన్న పదాలను ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: