జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ మ‌రోమారు ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై మండిప‌డ్డారు. చెట్లు నరికే వాళ్లకి, ఆడబిడ్డలను ఉరి తీసి చంపే వాళ్లని వెనకేసుకొస్తున్న వాళ్లకి పతనం మొదలైందని హెచ్చరించారు. జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోదిస్తాను. కొంతమందికే సీఎంలా ప్రవర్తిస్తే పేరు పెట్టే పిలుస్తాను. అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `ఆయనకు బత్తాయి చెట్లు నరికే ధైర్యం ఉంది గానీ ప్రత్యేకహోదా అడిగే ధైర్యం లేదు. ప్రజా సమస్యలను కేంద్రం ముందుకు తీసుకెళ్లే  ధైర్యం లేనప్పుడు 22 మంది ఎంపిలు ఉండి ఏం ప్రయోజనం? ` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

 

 


`అడ్డగోలుగా కబ్జాలు చేసేవారు, చీని చెట్లు నరికేవారు ఏమైనా దిగివచ్చారా? వారికి మనలా రక్త మాంసాలు లేవా? మీరు కొడితే మేం తిరిగి కొట్టలేమా? మీరు దాడులు చేస్తే మేం దాడులు చేయలేమా?` అంటూ ప‌వ‌న్ క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. వైసీపీ నాయకులకు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ``వైసీపీ నేత‌ల్లారా...ముందుగా మీ నాయకుడికి పద్దతి మార్చుకోమని, హుందాగా మాట్లాడమని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. నాకు వైసీపీ నాయకుల మీద గానీ, జగన్ రెడ్డి మీద గానీ ఎలాంటి శత్రుత్వం లేదు. వైసిపీ కార్యకర్తల్లోనూ నాకు అభిమానులున్నారు. సీమ సమస్యల మీద అనంతపురం కవాతుకు పిలుపు ఇస్తే మూడు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. ఓట్లు ఎందుకు వేయలేదు అంటే ఊర్లలో జనసేనకు ఓటు వేస్తామంటే ఊరుకోమంటూ వైసీపీ నాయకులు భయపెట్టారు అని యువత చెబుతున్నారు.`అని ప‌వ‌న్ పేర్కొన్నారు. 

 

 


రాయలసీమలో మానవ హక్కులు అత్యంత తక్కువ స్థాయిలో ఉంటాయని ప‌వ‌న్ పేర్కొన్నారు. `మనుషుల ప్రాణాలకు విలువలేని పరిస్థితులు, దోపిడి జరిగినా అన్యాయం జరిగినా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇక్కడ. మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను అని అడిగాను. నాకు జీవితంలో నచ్చని పదం పిరికితనం. అణిగిమణిగి ఉన్నా కొడతారు. ఎదురుతిరిగినా కొడతారు అన్నప్పుడు అవసరం అయితే మనం ధైర్యంతో దెబ్బ కొట్టించుకుందాం. పిరికితనం నుంచి మీ కడుపు మండాలి, ఆవేదన రావాలి.. మీ ఆవేదనకు జనసేన దారి చూపిస్తుంది. ఇక్కడ పుట్టిన యువతకు  చెబుతున్నా మీరు గుండెల నిండా ధైర్యాన్ని నింపుకోండి. అలా అని మిమ్మల్ని రోడ్ల మీద గొడవ పడమని చెప్పడం లేదు. నాయకుల్ని ఎదిరించమని చెప్పడం లేదు. మనకు అన్యాయం జరిగిందని గొంతు కూడా ఎత్తకపోతే వాళ్లు మనల్ని అధః పాతాళానికి తొక్కేస్తారు. నేను పార్టీ పెట్టింది యువత గుండెల్లో ధైర్యం నింపడానికే.జనసేన కార్యకర్తల మీద దాడులు చేస్తే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోమని, దాడికి ప్రతిదాడి చేయకపోతే చంపేస్తారన్న బోస్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న వాడిగా రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలో అది చేస్తాం` అని హెచ్చరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: