నల్గొండలోని మిర్యాలగూడలో గతేడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ని గతేడాది సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తన కూతురు అమృతవర్షిణి ఒక దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడంతో తట్టుకోలేని మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ని కడతేర్చాడు. ఇందుకోసం కోట్ల రూపాయలు సుపారీ కూడా ఇచ్చాడు.

 

 

ఇకపోతే ప్రణయ్‌ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయి శ్రవణ్‌, ఎంఏ కరీం, అస్గర్‌ అలీ, అబ్దుల్‌ బారీ, సుభాష్‌ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత మారుతీ రావు, శ్రవణ్‌, కరీం ఇటీవల విడుదలయ్యారు. ఇక తన భర్తను కిరాతకంగా హత్య చేసిన తన తండ్రి మారుతీ రావును బహిరంగంగా ఉరి తీయాలని అమృతవర్షిణి డిమాండ్ కూడా చేసింది.

 

 

ఇదిలా ఉండగా ఈ కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన మారుతీరావు తాజాగా తన కూతురు ప్రణయ్ భార్య అమృత వర్షిణిపై బెదిరింపులకు దిగినట్టు కేసు నమోదైంది. ఇకపోతే అమృత ప్రణయ్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉంది. ఈ నేపథ్యంలోనే అమృత వర్షిణిని ఆమె తండ్రి మారుతీరావు కరీం బెదిరిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం మారుతీరావు తన సన్నిహితుడైన కందుల వెంకటేశ్వరరావును మత్తిరెడ్డికుంటలోని అమృత ఇంటికి రాయబారానికి పంపించాడు.

 

 

మీ నాన్న ఆస్తినంతా రాసిస్తాడని.. అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్టు తెలిసింది.  అంతే కాకుండా మీ నాన్నకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆస్తిపాస్తులన్నీ నీకే దక్కేలా చేస్తానంటున్నాడని అమృతను ప్రలోభ పెట్టినట్టు తెలిసింది. కాగా  మారుతీరావు మధ్యవర్తి ద్వారా బెదిరించడం పై అమృత ఈనెల 11న వన్ టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం మారుతీరావు కరీం వెంకటేశ్వర రావును అరెస్ట్ చేసీ మళ్లీ జైలుకు పంపారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: