జ‌నసేన పార్టీ అధ్య‌క్షుడు రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై తీవ్రంగా విరుచుకుప‌డిన ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌పై శాపాలు కూడా పెట్టారు. రాయ‌ల‌సీమ‌లోని స్థితిగ‌తులు, రాజ‌కీయాలు, రైతుల గురించి ప్ర‌స్తావిస్తూ...ప‌వ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నాయకుల పొలాలు పచ్చగా ప్ర‌జ‌ల పొలాలు ఎండిపోయి క‌నిపిస్తున్నాయ‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``మన దేశంలోనే సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షపాతం తక్కువ. నేను రాయలసీమ పర్యటనలో చూస్తే నాయకులు ఉన్న చోట పొలాలు పచ్చగా ఉన్నాయి. సామాన్యులు ప్రజల భూములు ఎండిపోవడం బాధ కలిగించాయి` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

 

చాలా సార్లు రాయలసీమకు వచ్చినప్పుడు త‌న‌కు బాధ క‌లిగింద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``నేను వచ్చినప్పుడు ఇక్కడ చూసిన ఆవేదన, కోపం, పౌరుషం, కడుపు మంట కనబడుతూ ఉంటుంది. మిగతా  ప్రాంతాల్లో అది పిసరంత తక్కువే ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎందుకు కోపంతో ఉన్నారంటే.. నిజానికి ఇక్కడ కరువు లేదు. సృష్టించబడింది. రాయలవారు ఏలిననాడు తటాకాలు, చెరువులు పెట్టి కాలువలు తవ్వించి, అప్పుడు సశ్యశ్యామలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు పండవు. ఇక్కడున్న నాయకత్వం లోపమే అది. రాయలసీమ నుంచి జగన్ రెడ్డి గారితో సహా  ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే ఎందుకు వెనుకబాటు ఉంది? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేసే పరిస్థితులు ఎక్కువ. అన్ని ప్రాంతాల్లో ప్రజలు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తారు. నాయకులు ఇక్కడిలా ఇళ్లలోకి వచ్చి ధ్వంసాలు చేయరు. నాయకులకు ఎదురు తిరిగితే మన ఇళ్ల మీద దాడులు చేస్తారు, చెట్లు నరికేస్తారు అన్న ధోరణి మారాలి.` అని ప‌వ‌న్ పేర్కొన్నారు. 

 


భగవంతుడి సృష్టిని నాశనం చేస్తే సమూలంగా నాశనం అవుతారు అని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``నేను భావితరాల మీద ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చా. వారిని వాడుకుని భారతీ సిమెంట్స్ పెట్టేందుకు రాలేదు. మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకునే స్థాయికి తీసుకువెళ్లడానికి వచ్చాను. చినరాజపోడులో పచ్చని చీని చెట్లు నరికేశారు. కడపలో రైల్వే కోడూరు నడిబొడ్డున నిలబడి చెబుతున్నా మీరు నరికింది బత్తాయి చెట్లను కాదు ఆ భగవంతుడి సృష్టిని. ప్రతి చెట్టు మీకు శాపమై మిమ్మల్ని సమూలంగా నాశనం చేస్తుంది. రోజులు లెక్కపెట్టుకోండి. మా చెట్లు నరికేసే నాయకులకు, ఆడబిడ్డల్ని చిదిమేసే నాయకులకు, రైతన్నలకు అండగా ఉండని నేతలకు చెబుతున్నా. మిమ్మల్ని మేం చాలా బలంగా ఎదుర్కొంటాం. `` అని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: