మరణం ప్రతి వారికి తప్పదు కాని ప్రియాంక లాంటి మరణం ఏ ఆడపిల్లకు రాకూడదు. ఇకపోతే నాలుగు కాళ్ల పశువులకు వైద్యం చేయడం నేర్చుకుంది కాని రెండు కాళ్ల మగ మృగాల మనసును తెలుసుకోలేక పోయింది. లోకంలో బ్రతకడం నేర్చుకోలేక పోయింది. అందుకే కామాంధుల కళ్ల నుండి పుట్టిన మంటల వేడిలో కాలి బూడిద అయ్యింది. ఇకపోతే ఈ హత్యాచారం ఘటనతో ఓ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

 

 

యావత్తు దేశాన్ని కలవరపరచిన నిర్భయ ఘటన నేపథ్యంలో ఏళ్ల క్రితమే ఈ కొత్త నిబంధనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... సరిగ్గా అమలుకు నోచుకోలేదు. అయితే తాజాగా ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు నమోదులో జరిగిన జాప్యంతో ఇప్పుడు ఆ కొత్త నిబంధన అమల్లోకి వచ్చే సూచనలు పక్కాగా కనిపిస్తున్నాయి. ఆ కొత్త చట్టం పేరే జీరో ఎఫ్ ఐఆర్. అంటే ఏంటంటే ఫిర్యాదు స్వీకరణకు ఇకపై సరిహద్దుల లొల్లి ఉండదన్న మాట.

 

 

ఇకపోతే సాధారణంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు సమయంలో ఘటన జరిగిన ప్రాంతం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా? రాదా? అన్నదే చూస్తారు. తమ పరిధిలోకి వస్తేనే కేసు నమోదు చేస్తారు. లేదంటే పలానా స్టేషన్ కు వెళ్లాలని చెబుతారు. అయితే సాధారణ కేసుల్లో దీనివల్ల పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన వల్ల నిండు ప్రాణాలే బలికావచ్చు. ప్రియాంకారెడ్డి ఆపదలో ఉన్నానని ఇంటికి ఫోన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారట. శంషాబాద్ ఆర్జీఐఏ శంషాబాద్ రూరల్ పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందరు అనుకుంటున్నారు. కానీ ఈలోగా జరగరాని ఘోరం జరిగి పోయింది.

 

 

ఒకవేళ పోలీసులు గనుక వెంటనే స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ప్రియాంక తండ్రి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ జీరో ఎఫ్ ఐఆర్ డిమాండ్ ఊపందుకుంది. ఇక ఈ చట్టం గనుక అమలైతే ఎవరైనా ఫిర్యాదుకు వస్తే పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి ఎఫ్ ఐఆర్ కు ఓ నంబరు కేటాయిస్తారు. ఒకవేళ ఫిర్యాదు ప్రాంతం తమ పరిధిలోది కాదని భావిస్తే నంబరు లేకుండా ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలి. దీన్నే 'జీరో ఎఫ్ ఐఆర్' అంటారు.

 

 

ఇలా ప్రాథమిక దర్యాప్తు అనంతరం సంబంధిత స్టేషన్ కు కేసు బదిలీ చేస్తే వారు నంబరు కేటాయిస్తారు. ఇకపోతే కేంద్రం అమోదం తెలిపినా ఈ విధానాన్ని ఆ తర్వాత ఎవరూ పట్టించు కోలేదు. ముంబయిలో ఈ విధానం అమల్లో ఉన్నందున హైదరాబాద్ లో కూడా అమలు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు మొదలయ్యింది. అందువల్ల ప్రియాంకారెడ్డి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని కుటుంబ సభ్యుల తో పాటు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కూడా భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: