ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు . ప్రగతిభవన్ లో రాష్ట్రం లోని 97 డిపోలకు చెందిన   ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్  ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు . ఈ సందర్బంగా కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు కోర్కెలను నెరవేర్చేందుకు సానుకూలత వ్యక్తం చేయడమే కాకుండా , కార్మికులు ఊహించని హామీలను ఇచ్చారు . గత మూడు నెలలుగా జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులకు తీపికబురు విన్పించారు .  సెప్టెంబర్ నెల జీతాన్ని డిసెంబర్ రెండవ తేదీననే  కార్మికులకు అందజేస్తామన్న ఆయన , సమ్మె కాలానికి కూడా కార్మికులకు వేతనం చెల్లిస్తామని చెప్పారు .

 

ఇక సమ్మెకాలం లో మరణించిన కార్మికులకు ప్రభుత్వం తరుపున రెండు లక్షల నష్టపరిహారాన్ని అందజేయడమే కాకుండా , ఎనిమిది రోజుల వ్యవధిలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశాన్ని కల్పించాలని ఆదేశించారు . ఇక ప్రియాంకారెడ్డి ఘటన నేపధ్యం లో నైట్ డ్యూటీలను మహిళాకండక్టర్ల కు రద్దు చేయాలని ఆదేశించారు . ఎనిమిది గంటల్లోగా మహిళాకండక్టర్లు విధులు ముగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు . ఆర్టీసీని బతికించుకోవడానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు . వచ్చే బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తామని తెలిపారు .

 

 ఇక ఆర్టీసీ కార్మికులకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ , ఉద్యోగ విరమణ వయస్సు కూడా 58 నుంచి 60 ఏళ్లకు పెంచనున్నట్లు చెప్పారు . ఇక ఆర్టీసీ  లో యూనియన్ల కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావిస్తోన్న కేసీఆర్ , రెండేళ్ల వరకు గుర్తింపు యూనియన్ ఎన్నికల నిర్వహించేది  లేదని స్పష్టం చేశారు . ప్రతి డిపో నుంచి ఇద్దరేసి కార్మికులతో కార్మిక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు . కార్మికులతో కలిసి భోజనం చేసిన కేసీఆర్ , వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: