దేశవ్యాప్తంగా డాక్టర్ దిశ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్య కేసులో నిందితులు చెప్పిన విషయాలు విని షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. పోలీసుల విచారణలో నిందితులు దిశపై అత్యాచారం, హత్య చేసే సమయంలో తాగి ఉన్నామని ఏం చేస్తున్నామో అనే విచక్షణ కూడా లేదని లారీలో కూర్చొని విసుగు పుట్టి యువతి కనపడగానే ఏదో ఒకటి చేయాలనుకున్నామని చెప్పారు. 
 
నిందితులు దిశ ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత తేలిక అవుతుందని భావించామని పోలీసులకు చెప్పారు. దిశను చంపేసి కాల్చేస్తే తమకేమీ కాదని అనుకున్నామని ఇంత దూరం వస్తుందనుకోలేదు అని నిందితులు చెప్పటంతో పోలీసులు కంగుతిన్నారు. ఐరన్ రాడ్ల లోడ్ తో రాయచూర్ వెళ్లిన అరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు లోడ్ డెలివరీ చేయక ముందు కొన్ని ఐరన్ రాడ్లను దొంగలించి ఒకచోట దాచిపెట్టి లోడ్ డెలివరీ చేశారు. 
 
చోరీ చేసిన ఐరన్ రాడ్లను 4 వేల రూపాయలకు విక్రయించి వచ్చిన డబ్బులతో మద్యం కొనుగోలు చేశారు. మద్యం తాగిన తరువాత 6 గంటల సమయంలో దిశ స్కూటీని పార్క్ చేయడం చూసిన నిందితులు ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారం అత్యాచారం, హత్య చేశారు. నలుగురు నిందితులపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు మోపిన అభియోగాలు న్యాయస్థానంలో నిజమైతే మాత్రం నిందితులకు మరణ శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దిశ కేసును వేగంగా విచారించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దిశ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపట్టటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: