తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు మేలు చేకూరే విధంగా ఇంటర్ విద్యార్థుల ధ్రువపత్రాల్లో మార్పులు చేయబోతుంది. తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్థుల సర్టిఫికెట్లపై పాస్, ఫెయిల్ అని ముద్రించే విధానానికి స్వస్తి పలకాలని యోచిస్తోంది. పాస్, ఫెయిల్ కు బదులుగా క్లియర్, అన్ క్లియర్ అని ముద్రించాలని భావిస్తోంది. ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయామనే బాధ కొందరిలో కలుగుతోంది. 
 
అందువలన ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉందని సమాచారం. తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇతర దేశాల్లో ఉన్న విధంగా తొలి సంవత్సరం పూర్తయిన తరువాత విద్యార్థికి వీలైనప్పుడే ఆ తరువాత సంవత్సరాల్లో చదువుకునే, పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కూడా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ మేరకు ప్రతిపాదనలు పంపబోతుందని తెలుస్తోంది. 
 
కానీ కొందరు అధికారులు మాత్రం దేశంలో ఇంటర్ లో తొలి సంవత్సరం పూర్తయిన తరువాత సంవత్సరాల్లో పరీక్షలు రాసే అవకాశం ఎక్కడా లేదని రాష్ట్రంలో ఇలాంటి విధానం ప్రవేశపెట్టం వలన రాష్ట్ర విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక అధికారి మాట్లాడుతూ విదేశాలలో విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ చదువుకునే వీలు ఉంటుందని అందువలన అక్కడ చదువు ఎప్పుడైనా పూర్తి చేసే స్వేచ్ఛను ఇస్తారని మన దగ్గర అలాంటి పరిస్థితి ఉండదు కదా అని వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రభుత్వం ముందు పెట్టబోతున్న ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇంటర్ బోర్డు నిర్ణయాల వలన విద్యార్థులకు మేలు జరుగుతుందని చెబుతోంటే మరికొందరు మాత్రం ఈ ప్రతిపాదనలు అమలులోకి వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డ్ పెట్టబోతున్న ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: