సమాజంలో రాజకీయాలు చేసేవారు రాజుల్లా బ్రతుకుతారు. రాజకీయ చదరంగంలో రాళ్లదెబ్బలు తిన్న వారు మాత్రం బాధతో మూలుగుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్దితి ఇలాగే ఉంది. ఎందుకంటే కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు గా. ఏదో సాధిస్తామని కార్మికులు సమ్మెకు దిగారు. చివరికి ఏది సాధించ లేక కాళ్లబేరానికి వచ్చారు. సుమారుగా 50 రోజుల సమ్మెల్లో ఓట్లేసి నాయకులను ఎన్నుకున్న పాపానికి, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఇన్ని రోజుల సమ్మెలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారు.

 

 

ఇప్పుడు సమ్మె చేసిన వారు బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాగానే ఉంది. కాని ఓట్ల సమయంలో నాయకులిచ్చే వంద నోటుకు ఆశపడి కక్కుర్తిపడ్డ జనం ఇలాగే ఖర్మ అనుభ విస్తున్నారు. ఎందుకంటే  సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు బాగానే ఉన్నారు. వాళ్లపై అప్పట్లో మండిపడిన సీఎం కేసీఆర్... ఇప్పుడు వరాలు ప్రకటించి, సమ్మె కాలంలో జీతాలు కూడా ఇచ్చేస్తూ... వాళ్ల ప్రశంసలు పొందుతూ ఖుషీగా ఉన్నారు. ఎటొచ్చీ... తామే... రెండు నెలలుగా నానా తిప్పలు పడి... ఇప్పుడు మళ్లీ ఛార్జీల పెంపు భారాన్ని భరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ప్రజలు మండిపడుతున్నారు.

 

 

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే... తమపై భారం వెయ్యడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదేం లెక్క అని అడుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం అర్థరాత్రి నుంచీ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతోంది. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచుతోంది. ఆ లెక్కన 100 కిలోమీటర్లు ప్రయాణించేవారికి... టికెట్ చార్జీ అదనంగా రూ.20 పెరుగుతుంది.

 

 

ఐతే... ఇక్కడ మరో లెక్క కూడా ఉంది. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచితే... ప్రజల దగ్గర 20 పైసలు ఉండదు కాబట్టి... రౌండప్ చేస్తారు. అంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో కనిష్ట ఛార్జీ రూ.5 ఉండగా... 2 నుంచీ 5వ స్టాప్ వరకూ ప్రస్తుతం రూ.10 తీసుకుంటున్నారు. కొత్త ఛార్జీల ప్రకారం ఇకపై రూ.15 తీసుకుంటారు. ఇలా ప్రతి నాలుగు స్టాపులకూ రూ.5 పెంచుకుంటూ పోతారు.

 

 

పల్లె వెలుగు బస్సుల్లో కూడా కనీస ఛార్జీ రూ.10గా ఉంచి... ఐదు కిలోమీటర్ల తర్వాత రూ.15 చేస్తున్నారు. చిల్లర సమస్య రాకుండా ఇలా చేస్తున్నా... ప్రయాణికులపై మాత్రం భారీ ఛార్జీల మోత ఇప్పుడు తప్పదు. ఇకపోతే ప్రజల్లో మార్పు రానంత వరకు వ్యవస్ద మారదు. నాయకులు మారరు. ముందుగా మారవలసింది ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: