లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో జయప్రకాశ్ నారాయణ కారులోనే ఉన్నారు. అయితే జయప్రకాశ్ నారాయణ కు ఎలాంటి గాయాలు కాలేదు. అసలు ఏమైందంటే..హైదరాబాద్ కెబిఆర్ చౌరస్తా నుంచి జూబ్లిహిల్స్ వైపు వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

 

 

జయప్రకాశ్ నారాయణ కారు టైర్ పంచర్ అవడంతో వాహనం అదుపు తప్పింది. విషయం గమనించిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కారును ఆపే ప్రయత్నం చేశారు. దాంతో కారు ఒక ఆటోని డీకొట్టినట్లు తెలుస్తోంది. కారు గుద్దడంతో ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ కారు దిగి ఆటోలోవారితో మాట్లాడారు.

 

 

గాయపడిన వారిని పరామర్శించారు. స్వల్పగాయాలే అయ్యాయని తెలుసుకున్న ఆయన.. వారికి ఇబ్బంది లేదని తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదం కారణంగా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని జయ ప్రకాశ్ నారాయణ తెలిపారు. ఇటీవల ప్రముఖులకు రోడ్డు ప్రమాదాలు కామన్ అయ్యాయి. ఇటీవల తెలుగు దేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అచ్చెన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలో అతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన కారు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

 

 

ఇక జయప్రకాశ్ నారాయణ గతంలో లోక్ సత్తా స్వచ్చంద సంస్థను పార్టీగా మార్చారు. కానీ అది అంతగా విజయవంతం కాలేదు. జయప్రకాశ్ నారాయణ ఒక్కడే కూకట్ పల్లి ఎమ్మెల్యేగా గెలిచారు తప్ప.. మిగిలిన పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసినా విజయం సాధించలేదు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు జయప్రకాశ్ నారాయణ దూరంగా ఉంటున్నారు. లోక్ సత్తా పార్టీని కూడా నడిపించే ప్రయత్నం చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: