దిశ అత్యాచారం, హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేపిస్టులను ఉరి తీయాలని దేశమంతా ముక్తకంఠంతో నినదిస్తోంది. చివరకు ఆ రేపిస్టులను కన్న తల్లులు కూడా వారికి ఈ భూమ్మీద బ్రతికే హక్కు లేదంటున్నారు. అయితే ఇంతకీ ఈ రేపిస్టులు ఎందుకు అంత దారుణానికి ఒడిగట్టారు. అత్యాచారంతో ఆప కుండా ఎందుకు చంపేసారు..?

 

అసలు ఈ రేపిస్టులు చెబుతున్నదేంటి. వారి గొంతు విప్పి తొలిసారి ఏం చెప్పారు.. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి. పోలీసు వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకాశం దిశ రేపిస్టులు ఏం చెప్పారంటే..” ‘ఏమో సార్‌.. అప్పుడు మేం ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం..

 

దిశ’ ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత సులువవుతుందని అనుకున్నాం.. రాత్రి 9 గంటల తర్వాతే దిశ రావడంతో హడావుడిగా లారీలో నుంచి కిందకు దిగాం.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని మద్యం తాగుతూ నిర్ణయించుకున్నాం.. ఆమెను చంపేసి కాల్చేస్తే ఇంత దూరం వస్తదనుకోలేదు.. ఇవీ హంతకులు చెప్పిన భయంకర నిజాలు.

 

నిందితుల నుంచి ఈ వాదన విన్న పోలీసులే అవాక్కయ్యే పరిస్థితి ఉంది. ఒక ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏమైనా చేయొచ్చనుకున్న వారి తెగింపు వారి నేరస్వభావాన్ని తెలుపుతోంది. అంతే కాదు.. చంపేసి కాల్చేస్తే.. ఎవరు చూస్తారు.. ఏమవుతుంది.. అన్న ధీమా వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చట్టం, న్యాయం, శిక్ష వంటి పర్యవసానాల గురించి వారు కించిత్ కూడా ఆలోచించలేదన్నమాట.

 

దేశం సిగ్గుపడే ఈ ఘోరం విషయంలో మనం మరో విషయం గమనించవచ్చు.. రేపిస్టులకు అంత ధైర్యం ఇచ్చింది ఏంటి.. కేవలం మద్యపానం.. మరి ఈ విషయంపై ప్రభుత్వాలు ఆలోచించవా.. విచ్చలవిడిగా మద్యం అమ్మకుంటూ.. వచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తామనే ప్రభుత్వాలు మద్యాన్ని కట్టడి చేసే ఆలోచన చేయవా.. ఆలోచించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: