దిశ అత్యాచారం, హత్య కేసును పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. అసలు మొదట కేసు నమోదు చేసుకోవడానికే రెండు పోలీస్ స్టేషన్లు తిప్పిన విషయం తెలిసిందే. మొదట్లో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించినా.. కేసు తీవ్రత అర్థమైన తర్వాత పోలీసులు వేగంగానే స్పందించారు. కేసులో నిందితులను 24 గంటల‌లో గుర్తించారు.

 

సకాలంలో వారు పారిపోకుండా పట్టుకున్నారు. వారితో నేరాంగీకారం ఒప్పించారు. అంతా బాగానే ఉంది. కానీ ఇంకా ఈ కేసులో మరో మిస్టరీ మాత్రం మిగిలిపోయింది. అదేంటంటే.. అసలు 27 వతేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిందితులు ఏం చేశారు.? ఈ విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో తాను దొంగిలించిన ఇనుప కడ్డీలను విక్రయిద్దామని.. అందుకు సాయంగా రావాలంటూ నవీన్‌, చెన్నకేశవులను ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరీఫ్‌ పాషా పిలిచాడు.

 

నిందితులంతా కలిసి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చోరీచేసిన సొత్తును అమ్మేశారు. అదేరోజు రాత్రి శంషాబాద్‌ శివారుల్లోని తొండుపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ కూడలికి వచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు వారు మద్యం తాగడం ప్రారంభించారు. అదే రోజు సాయంత్రం దిశ అక్కడ స్కూటీ పార్క్ చేయడం గమనించారు. కుట్ర పూరితంగా స్కూటీకి పంక్చర్ చేశారు.

 

దాన్ని బాగు చేయిస్తామని నమ్మబలికి.. ఆ తర్వాత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఇక ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే.. కానీ.. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురూ కలిసి ఏం చేశారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇప్పుడు ఈ విషయాన్ని పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ విషయం తేలితే కానీ.. కేసు మరింత పకడ్బందీగా రూపొందే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: