ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తొందరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా ? సిని రంగంతో పాటు రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఇదే విషయమై చర్చలు జోరందుకున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే కర్నాటకలో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఈ హాస్యనటుడు ప్రచారం చేయటం. దాంతో బ్రహ్మానందం రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కర్నాటకలోని చిక్ బళాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో డాక్టర్ సుధాకర్ పోటి చేస్తున్నారు.  ఈయన బిజెపి తరపున పోటి చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ బ్రహ్మానందానికి రాజకీయ వాసనలున్నట్లు  బయటపడలేదు.  ఏ రాజకీయ సభలో కానీ నేతలతో కాని సన్నిహితంగా తిరిగినట్లు కనబడని బ్రహ్మానందం ఒక్కసారిగా అదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో అందరూ షాకయ్యారు.

 

మొత్తానికి బిజెపి అభ్యర్ధి తరపున హాస్యనటుడు చాలా జోరుగానే రోడ్డుషోలు నిర్వహించారు. చిక్ బళాపూర్, బాగేపల్లి, గౌరి బిదనూర్ నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. అందులోను సినిమా ఫీల్డుతో సంబంధాలున్నవారే కాకుండా సినిమా అభిమానులు కూడా చాలా ఎక్కువున్నారు.

 

అందుకనే బ్రహ్మానందం పాల్గొన్న రోడ్డుషోలకు జనాలు విరగబడి వచ్చారు. మరి వాళ్ళంతా బిజెపికి ఓట్లేస్తారా ? అన్నది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే ఆమధ్య జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున నటుడు సాయికుమార్ పోటి చేసి ఓడిపోయారు. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసిన సుమలత మంచి మెజారిటితో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.

 

పాల్గొన్న ప్రతి రోడ్డుషోలోను బ్రహ్మానందం బాగా ఉత్సాహపరుస్తు మాట్లాడారు. ప్రత్యర్ధులపై జోరుగా సెటైర్లు కూడా వేశారు. బ్రహ్మానందం ఉత్సాహం చూసిన తర్వాత తొందరలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అందులోను చాలామంది బిజెపి వైపు చూస్తున్నారు కదా. ఇపుడు ఎలాగూ బ్రహ్మానందం బిజెపి అభ్యర్ధికే ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ హాస్యనటుడు కూడా బిజెపిలో చేరుతారనే ప్రచారం పెరిగిపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: