హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ మహిళా కమిషన్ నుంచి, కేంద్రపశుసంవర్థ శాఖ మంత్రి అజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వంటి వారు దిశ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. ‌అటు రాహుల్ గాంధీ మొదలుకుని.. అనేక పార్టీల నేతలు స్పందించారు.

 

ఇక ఇప్పుడు ఈ అమానుష హత్యాచార ఉదంతం పార్లమెంటును సైతం కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పశు వైద్యాధికారి హత్యాచార ఘటనను పార్లమెంటులో ప్రస్తావించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇప్పటికే ఊదంతంపై జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది.

 

ఢిల్లీలో నిర్భయ కేసు తర్వాత మరోసారి ఈ దిశ హత్యాచార ఉదంతం ఆందోళనలకు దారి తీసింది. అనేక చోట్ల దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ లోనూ ఈ దిశ హత్యాచార ఉదంతంపై చర్చ జరిగితే అది కొత్త చట్టాలకు ఊపిరిపోసే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే పాత చట్టాల దుమ్ముదులపాలంటూ కేటీఆర్ ఏకంగా ప్రధాని మోడీకి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలంతా పార్లమెంట్ లో ఈ అంశంపై గళమెత్తే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. దేశంలో నిర్భయ ఘటన తర్వాత ఆమె పేరుతో కొత్త చట్టమే వచ్చింది. ఇప్పుడు దిశ విషయంలోనూ అదే జరగాల్సిన అవసరం ఉంది. నిందితులను ఏళ్లకు ఏళ్లు మేపకుండా... నెలల వ్యవధిలోనే ప్రక్రియ అంతా పూర్తయి.. ఉరి శిక్షలు అమలైతేనే.. ఇలాంటి అన్యాయాలకు తగిన న్యాయం జరుగుతుంది. జనం కూడా కొంత వరకూ భద్రత ఫీలవుతారు. మరి కేంద్రం ఈ విషయంలో ఏమైనా చేయాలంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావాలి. అందుకు పార్లమెంట్ వేదిక అవుతుందని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: