తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి సీఎం బయల్దేరి వెళతారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉందని సీఎంవో కార్యాలయం తెలిపింది. సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉందని సీఎంవో తెలిపింది. దీనిపై ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.

 

 

ప్రధానమంత్రితో భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు గురంచి ప్రస్తావించనున్నారని అంటున్నారు. దీంతో పాటు విభజన హామీలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించే అంశంపై నా ప్రధానితో చర్చించనున్నారని తెలుస్తోంది. రక్షణ శాఖ భూముల కేటాయింపు గురించి ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. వీటితోపాటు మరికొన్ని కీలక అంశాలపై కూడా ప్రధాని మోదీతో చర్చించనున్నారని సీఎంవో వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధానితో భేటీ అనంతరం కేంద్రమంత్రులు.. అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్‌ గడ్కరీలను కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలసి రాష్ట్రానికి అవసరమైన సాయం గురించి చర్చిస్తారని సమాచారం.

 

 

కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఇంతకు ముందు వరకు ఎటువంటి ప్రకటనా లేదు. ఉన్నట్టుండి ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధమవ్వడం చర్చనీయాంశం అయింది. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఈ అంశాలన్నింటి పైనా చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులుపై స్పష్టత తీసుకురానున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై, ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: