దిశ అత్యాచారం, హత్య ఉదంతం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య ఘటనపైపార్లమెంటులో ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబట్టింది. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓకే చెప్పేశారు.

 

దీంతో అన్ని పార్టీల నేతలు దిశ ఘటనపై తమ ఆవేదన, ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు నలుగురు ఎంపీలకు ఉరి వేయాలని ఏఐడీఎంకే ఎంపీ ఒకరు డిమాండ్ చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని తెలిపారు.

 

ఇప్పుడు ఈ అంశం కూడా హాట్ టాపిక్ అవుతోంది. గతంలోనూ నిర్భయ ఘటన జరిగింది. కానీ ఇప్పటివరకూ నిందితులు బతికే ఉన్నారు. నిర్భయ ఘటన జరిగి దాదాపు ఏడేళ్లవుతోంది. అందుకే ఇలా జాప్యం లేకుండా పార్లమెంట్ చట్టం చేసే అంశాన్ని పరిశీలించాలని పలువురు ఎంపీలు కోరుతున్నారు. ఇక మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.

ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు. న్యాయస్థానాలు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చలన్నీ ఫలించి.. సత్వర విచారణ, శిక్షలకు అనుకూలంగా త్వరలో చట్టం తీసుకురాగలిగితే.. దిశ అత్యాచారం హత్య కేసు నిందితులకు రోజుల సమయంలోనే శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలా జరగాలని ఆశిద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: