హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్య కేసు పార్ల‌మెంటును కుదిపేసింది. పార్టీల‌కు అతీతంగా, ప్రాంతాల‌తో సంబంధం లేకుండా...లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులంతా ఈ ఘ‌ట‌న‌పై గ‌లం విప్పారు. రాజ్యసభలో చ‌ర్చ‌ను చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రారంభించారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్య కేసు మన సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానం. ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో, వీటి పరిష్కార చర్యల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. దిశ హత్య ఘటనపై ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను వెంకయ్య నాయుడు కోరారు. కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన ఆకాంక్షించారు. 

 

రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ...దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని అన్నారు. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలని చెప్పారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులకు శిక్షపడాలని గులాం నబీ ఆజాద్ ఆకాంక్షించారు. ఎస్పీ ఎంపీ జయబచ్చన్ మాట్లాడుతూ... ఈ హ‌త్య‌కేసులో నిందితులకు ప్రజల మధ్యలోనే శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. దిశ హత్య కేసులో ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఘోరమైన నేరానికి పాల్పడిన ఈ నలుగురు నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆమె స్ప‌ష్టం చేశారు. నిర్భయ కేసులో ఇంకా న్యాయం జరగలేదని జ‌యాబ‌చ్చ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 


అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్‌ మాట్లాడుతూ.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ‘దిశను హత్య చేసిన నలుగురు నిందితులను డిసెంబరు 31లోపు శిక్షించాలి. మరణించేంత వరకు వారిని ఉరితీయాలి`` అని డిమాండ్ చేశారు. దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే అమలు చేయాలని ఎంపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. సభ్యులు సూచనల అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..  హైదరాబాద్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చట్టాల వల్ల బాధితులకు న్యాయం జరగదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి``.అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: