దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్‌ దిశ హత్యోదంతం క‌లక‌లం ఇంకా కొనసాగుతోంది. దీనిపై ఓ వైపు ఆందోళ‌న‌లు సాగుతుండ‌గానే...మ‌రోవైపు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ చర్చ జరుగుతోంది. జస్టిస్‌ ఫర్‌ దిశని హత్య చేసిన నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌గ్రామాలకు చెందిన మహ్మద్‌పాషా, నవీన్‌కుమార్, చెన్నకేశవులు, శివలనే నిర్ధారణ అనంతరం పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ సంఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. అయితే, ఈ స‌మ‌యంలోనే నిందితుల‌కు ద‌క్కుతున్న మ‌ర్యాద‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 

 


నిందితులు మహమ్మద్‌ బాషా, బొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్‌కుమార్‌లకు జైలు అధికారులు నిబంధ‌న‌లు పాటించి భోజ‌నం పెట్టిన‌ప్ప‌టికీ...ఆ మాన‌వ‌మృగాల‌కు ఇలా మ‌ర్య‌ద‌లు ద‌క్క‌డంపై ప‌లువురు భ‌గ్గుమంటున్నారు. జైల్లో ఉన్న నిందితుల‌కు   ఆదివారం ఉదయం పులిహోర, మధ్యాహ్నం సాధారణ భోజనం, రాత్రి మాంసాహారం అందజేశారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆదివారం మటన్ పెడతారు కాబ‌ట్టి వీరికి మాంసాహారం అందించార‌ని స‌మాచారం. కాగా, నిందితుల‌కు రెండుసార్లు టీ కూడా అందించినట్లు తెలుస్తోంది. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులకు జైలు అధికారులు సండే స్పెషల్‌ రుచి చూపించడంపై ప‌లువురు మండిప‌డుతున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, చ‌ర్ల‌ప‌ల్లి జైలులోని మహానంది బ్యారక్‌లో వేర్వేరు గదుల్లో నిందితుల‌ను ఉంచారు. టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న మొద్దు శీనును చంపిన ఓంప్రకాష్‌ను ఉంచిన బ్యారక్‌లోనే ఇప్పుడు ఈ నలుగురి కి జైలు సిబ్బంది కేటాయించినట్లు తెలుస్తోంది. జైల్లో కూడా వారిపై దాడి జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆయా బ్యారక్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం కూడా బ్యారక్‌ల వద్దకే పంపారు. జైల్లోని ఇతర ఖైదీలు దాడి చేసే అవకాశం ఉండటంతో పాటు నిందితులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం కూడా ఉందని, అందుకే వారిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: