మహారాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపించుకోవటంలో ఉద్ధవ్ థాక్రే సర్కార్ సక్సెస్ అయ్యింది. ఇక మిగిలింది కేబినెట్ బెర్తుల పంపకమే. ఇందులో ఎక్కువ భాగం ఎన్సీపీకే కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు...కాంగ్రెస్ సైతం కీలక శాఖల కోసం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు...మహారాష్ట్రలో మంత్రిత్వ శాఖల కేటాయింపు పార్టీల మధ్య ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

 

మహారాష్ట్రలో కేబినెట్‌ కూర్పులో శరద్ పవార్ తనదైన మార్కు చూపించాలని తెగ తాపత్రయపడుతున్నారు. నిజానికి...ఇప్పటి వరకూ మహారాష్ట్రలో పాలిటిక్స్‌ను తెరవెనకుండి శాసిస్తూ వచ్చారు శరద్ పవార్. మంత్రివర్గ కూర్పు, మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లోనూ ఆయన ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారు. మంత్రివర్గంలో ఎక్కువ భాగం ఎన్సీపీకే దక్కేలా వ్యూహం రచిస్తున్నారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలు కూడా ఎన్సీపీ ఖాతాలోనే వేయాలని శరద్ పవార్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తం 43 కేబినెట్ మంత్రి పదవులుండగా, అందులో 16 కేబినెట్ బెర్త్‌లు ఎన్సీపీ ఖాతాలోనే పడతాయని తెలుస్తోంది.

 

అయితే...శివసేనతో పోలిస్తే ఎన్సీపీ సాధించిన సీట్లు తక్కువే. అయినా సరే, మంత్రివర్గంలో శరద్ పవారే పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కే అత్యంత కీలకమైన స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఎన్సీపీ బెట్టు చేస్తున్నా సరే.. కాంగ్రెస్ మంత్రి పదవుల విషయంలో ఏమీ అనడం లేదని కొందరు భావిస్తున్నారు. ఇక శివసేనకు 15 బెర్తులు, కాంగ్రెస్‌‌కు 12 బెర్తులు లభించనున్నట్లు సమాచారం. అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ, ఆర్థికం ఎన్సీపీకే దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇక...శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడైన జయంత్‌ పాటిల్‌ కేబినెట్‌ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో పాటిల్ హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రెండో వ్యక్తి ఛగన్ భుజ్‌బల్. ఉద్ధవ్‌తో పాటు మంత్రిగా భుజ్‌బల్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్‌కు దక్కనుంది. అయితే దీనిపై పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని నేతలు చెబుతున్నారు.

 

'మహా వికాస్ ఆగాఢీ'లో మరో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు కీలక శాఖ అయిన రెవెన్యూ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి మహా కాంగ్రెస్ చీఫ్ బాలసాహెబ్ థోరట్‌తో పాటు మాజీ సీఎం అశోక్ చవాన్ పోటీలో ఉన్నారు. వీరిద్దరు కూడా ఉద్ధవ్‌తో పాటు శివాజీ పార్క్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బాలాసాహెబ్ ధోరట్ ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అశోక్ చవాన్ గతంలో మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరూ అత్యంత కీలక నేతలే కావడంతో రెవెన్యూ మంత్రిగా ఎవర్ని నియమించాలని కాంగ్రెస్ వర్గాలు ఆలోచిస్తున్నాయి. 


మొత్తానికి...ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావటంలో చక్రం తిప్పిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పుడు తమ పార్టీకి ఎక్కువ కేబినెట్ బెర్తులు ఇప్పించుకునే పనిలో పడ్డారు. ఐతే...ఆయన ఇందులో ఎంత వరకూ సక్సెస్ అవుతారనేది మాత్రం చూడాల్సిందే.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: