చంద్రబాబునాయుడుకి అధికారంలో లేకపోయినా సెగ అలా ఇలా తగలడంలేదు. నిన్న అమరావతి వెళ్తే రైతుల నుంచి వ్యతిరేకత ఎంతలా వచ్చిందో అందరూ చూశారు. చెప్పులతో సైతం దాడి చేశారు. నిజంగా ఇది బాధాకరమే అయినా బాబు తన పాలనలో చేసిన దానికి, తీసుకున్న నిర్ణయాలకు అలా వచ్చిన వ్యతిరేకతగా దాన్ని చెబుతున్నారు.

 

ఇక ఇపుడు చంద్రబాబు రాయలసీమ టూర్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా అయన‌కు నిరసనలు తప్పడంలేదు. బాబు రాయల‌సీమకు చెందిన నాయకుడే అయినప్పటికీ ఆయన శ్రీ భాగ్ ఒప్పందాలను ఉల్లఘించి  రాజధాని, హైకోర్టు రెండూ కూడా అమరావతిలోనే పెట్టారని అంటున్నారు. దీనివల్ల రాయలసీమకు అన్యాయం జరిగిందని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా చంద్రబాబు మూడు రోజుల పాటు కర్నూల్లో పార్టీ  సమీక్షా సమావేశాల పేరిట చేస్తున్న పర్యటనకు ఈ రోజు రాయల సీమ సెగ తగిలింది.రాయలసీమ విద్యార్ధి సంఘాల పేరిట జేయేసీ నాయకులు బాబుకు గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. బాబుని వీజేఅర్ ఫంక్షన్ హాలు వద్ద జేయేసీ నేతలు పెద్ద ఎత్తున  అడ్డుకున్నారు. సీమకు బాబు ద్రోహం చేశారని వారు విమర్శించారు.

 

బాబు తక్షణం సీమలో రాజధాని కానీ హై కోర్టు కానీ పెట్టేందుకు తాను అనుకూలమని ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిల ఉండగా  చంద్రబాబు సీమ పర్యటనకు ఆదిలోనే అంతరాయం కలగడం ఇపుడు చర్చగా ఉంది. బాబును అడ్డుకునేందుకు వెళ్ళిన జేయేసీ నాయకులను అక్కడ నుంచి పంపించివేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయడంతో వివాదం చెల‌రేగింది.

 

ఈ నేపధ్యంలో జేయేసీ నాయకులు మరింతగా గట్టిగా నినాదాలు చేశారు. తమ ప్రాంతానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాబుకు ఇది ఓ విధంగా చేదు అనుభవమేనని అంటున్నారు.   చూడాలి మరి ఏం జరుగుతుందో. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: