'ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు' అనేది సామెత. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అదే ఉల్లి సామాన్యులకు ఏ మేలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఎందుకంటే ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి మరి. ఉల్లి ధరలు భరించలేక సామాన్యులే కాదు వాటి మీద ఆధారపడ్డ హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా ఆహార ప్రియులు ఉల్లితో ముడిపడ్డ అల్పాహారం, కూరలు లేక తమ జిహ్వ రుచిని చంపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధర కేజీ రూ.100 వరకూ పెరిగిపోవటమే ఇందుకు కారణం.

 

 

ముఖ్యంగా ఉల్లిదోశ ఎందరికో ఇష్టమైన  అల్పాహారం. ఉదయం పూట ఉల్లిదోశ, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో చపాతీ ఎక్కువగా తింటూంటారు. వీళ్ళందరికీ ఈ టిఫిన్లలో ఉల్లి దొరకటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే బెంగళూరులోని చాలా రెస్టారెంట్లలో ఉల్లి దోశను వేయటం లేదు. కేవలం ఉల్లి కోసమే రూ.15 పెంచి వేయాల్సి వస్తోందని అంటున్నారు. దీనిపై ప్రజల్లో పెద్దగా స్పందన రాకపోగా అదనపు నష్టం వస్తోందని అంటున్నారు. దీంతో ఉల్లి దోశనే ఆపేశామని అంటున్నారు. ఇక కూరల్లో ఉల్లి అవసరం సరేసరి. ముంబయిలో కూడా ఇవే సంఘటనలు ఎదురవుతున్నాయి. దేశంలో చాలాచోట్ల నో ఉల్లి దోశ బోర్డులు వెలుస్తున్నాయట.

 

 

ఉల్లి ధరలను అదుపులోకి తీసుకురావడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. ఏపీలో రైతు బజార్లలో ఆధార్ కార్డు చూపిస్తే రూ.25కే ఇస్తోంది. దీంతో రైతు బజార్లలో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉల్లి ధర కేజీకి రూ.100 వరకూ ఉంటోందని సమాచారం. ఉల్లి ధరలు పెరిగితే సంబరాలు చేసుకునేది వాటిని పండించే రైతులు మాత్రమే. కానీ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఉల్లి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేదెన్నడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: