తెలంగాణలో ప్రతి కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున టికెట్ ధరను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో కనీస ఛార్జి రూ.10 (ఆర్డినరీ), డీలక్స్, సూపర్ లగ్జరీ టికెట్ల కనీస ఛార్జీలు వరుసగా రూ.20, రూ.25కు పెంచారు. ఇక ఏసీ సర్వీసులైన రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో కనీస ఛార్జీలు రూ.35.. వెన్నెల స్లీపర్ బస్సులో రూ.70కి పెంచారు. ఈ మేరకు బస్ పాసుల ధరలు కూడా పెరిగాయి. 

సోమవారం (డిసెంబర్ 2) అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిపోల నుంచి బయలుదేరే బస్సుల్లో ఈ కొత్త ఛార్జీల ప్రకారం ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. మొత్తంమీద ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్లు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులపై ఛార్జీల భారం పడింది. 

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులు లక్డీకాపూల్‌లోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం  ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు నాయకత్వం వహించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశత్వ ధోరణి ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కిలో మీటర్‌కు 20 పైసలు పెంచడంతో పాటు.. రూ.5 ఉన్న కనీస టికెట్ ఛార్జీని రూ.10కి పెంచడం దారుణం అన్నారు. 

ఆర్టీసీ ఛార్జీల పెంపు వల్ల ప్రజలపై ఏడాదికి రూ.వెయ్యి కోట్ల భారం పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను అనునాయులకు కట్టబెట్టుకుంటూ ప్రజలపై సీఎం కేసీఆర్ ఆర్థిక భారాన్ని మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించి పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకుంటున్నారు. కానీ, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సీఎం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదు అని ఆయన హెచ్చరించారు. అనంతరం ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: