లైంగిక దాడులకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందని ప్రశ్నిస్తోంది మహిళా లోకం. దేశవ్యాప్తంగా ఇదే ప్రశ్నతో నిరసనలతో కదం తొక్కుతోంది నారీ ప్రపంచం. దిశ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది.

 

నిర్భయ ఘటన తర్వాత  దేశవ్యాప్తంగా విద్యార్థి, మహిళా సంఘాలను కదిలించింది దిశ పాశవిక అత్యాచారం, హత్య. రోజుల చిన్నారుల నుంచి.. పండు ముసలి వరకూ ఎవరినీ కామాంధులు వదలడం లేదని.. కఠిన చట్టాలు.. కఠిన శిక్షలు లేకపోవడం వల్లే వారు రెచ్చిపోతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర ఐద్వాతోపాటు ఇతర మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.  ఎ.ఐ.ఎస్.ఎఫ్ స్టూడెంట్‌ వింగ్‌ కూడా తమ నిరసన గళం విప్పింది. 

 

అటు బెంగళూరు కూడా ఆందోళనలతో హోరెత్తింది. ఎ.ఐ.ఎమ్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మహిళలు. నిర్భయ ఘటన తర్వాత మహిళలపై దాడులకు ఫుల్‌స్టాప్‌ పడలేదని.. రోజు రోజుకీ బాలికలు, యువతులపై అకృత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు నిరసనకారులు. ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు, ప్లకార్డులు పట్టుకుని.. తమపై దాడులకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందని ప్రశ్నించారు ఆందోళనకారులు. పార్లమెంట్‌లో ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు.

 

దిశ హత్య కేసులో నిందితులను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు ఎ.బి.వి.పి విద్యార్థినులు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్క్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నా వారిని తోసుకుంటూ ముందుకు దూసుకుపోయారు విద్యార్ధినులు. రాలీ మొత్తం నినాదాలతో హోరెత్తించారు.

 

దిశ హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ  బీజేపీ యువమోర్చా కార్యకర్తలు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆందోళనకు దిగారు. మానవహారం నిర్వహించారు. దోషులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కార్యకర్తలు. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ కూడా హాజరయ్యారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా.. చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు లక్ష్మణ్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: