కేసీఆర్ మొన్నటి వరకు ఆర్టీసీ కార్మికులతో ఖయ్యానికి కాలు దువ్వాడు. తరువాత కార్మికులు దిగిరావటంతో కేసీఆర్ కూడా వారికీ ఉద్యోగాలు ఇచ్చి వారికీ సమ్మె కాలంలో వేతనాలు కూడా తిరిగి ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అయితే ఇక ఇదే సమయంలో యూనియన్లని రద్దు చేసారు. అలాగే ఆదివారం రాష్ట్రంలోని ప్రతి డిపో నుండి ముగ్గురు మగవాళ్ళు - ఇద్దరు ఆడవాళ్లు చొప్పున ఐదుగురిని ప్రగతి భవన్ కి పిలిపించుకొని వారితో మాట్లాడారు. అలాగే వారితోనే మధ్యాహ్నం భోజనం కూడా చేసారు.  ఉద్యోగులు సమ్మెల పేరుతో సమస్యలను సృష్టించకుండా బాగా పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళితే సింగరేణి తరహాలో ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇస్తామని వారికి హామీ ఇచ్చారు.

 

దానితో పాటు ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ చాలా వరాలు కురిపించారు. మహిళా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే  సమ్మె కాలానికి (52 రోజులు) సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ఇలా ఆర్టీసీ కార్మికుల పై వరాలజల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ...ప్రజలపై మాత్రం పెద్ద గుదిబండ వేశారు. ఆర్టీసీ ని కాపాడాలని అంటే ఉన్న ఏకైక మార్గం టికెట్స్ ధరలు పెంచడం ఒక్కటే మార్గం అని చెప్పి ..టికెట్స్ ధరలని పెంచేశారు. 

 

దీనితో ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సమ్మె కాలంలోనూ మరియు ఇప్పుడు ప్రజలే ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆదివారం కార్మికులతో భేటీ సందర్భంగా దీనిని ఒకరోజు వాయిదా వేసింది. తాజాగా సోమవారం బస్సు ఛార్జీల పెంపును ఖరారు చేసింది. ఇందులో భాగంగా ప్రతి కిలోమీటర్ కి 20 పైసలు పెంచనున్నారు. దీనితో సామాన్యుడి జోబుకి భారీగానే చిల్లు పడే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: