జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడిని తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్డు కూలీలు, తిరుమల తిరుపతి ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్లు కలిశాయి. తమ సమస్యలను విన్నవించుకున్నారు. వాహనమిత్ర పేరుతో రూ. 10 వేలు ఇచ్చి ఫైన్ల పేరుతో అంతకు మించి లాక్కుంటున్నారని పవన్ కల్యాణ్ దగ్గర తిరుమల తిరుపతి టాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

ముందు టీటీడీ లైసెన్డ్సు కూలీలు పవన్ కళ్యాణ్‌కు తమ బాధలను తెలిపారు. ``టీటీడీ ఏర్పాటు చేసినప్పటి నుంచి లైసెన్స్డు కూలీలుగా పని చేస్తున్నాం. తిరుమల కొండపైనే నివాసం ఉండేవాళ్లం. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మమ్మల్ని నిర్వాసితులను చేసి కొండ కిందకు పంపించేశారు. నిర్వాసితులైన మాకు ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో పాలకులు, అధికారులు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న పట్టించుకున్న నాథుడే లేడు` అని వాపోయారు. వారి బాధలను విన్న పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. 

 

కాగా, వాహనమిత్ర పేరుతో రూ.10వేలు ఇస్తున్న ప్రభుత్వం..ఈ చలాన్ల పేరుతో అంతకుమించి ఎక్కువ గుంజుకుంటుందని తిరుమల తిరుపతి ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్లు ఆవేదన వ్యక్తం చేశాయి. ``సిగ్నల్ పని చేయడం లేదని, నో పార్కింగ్ అంటూ వేలాది రూపాయలు ఫైన్లు వేస్తున్నారు. రోడ్డు ట్యాక్స్ కింద మూడు నెలలకు రూ. 5 వేల 800 చెల్లిస్తున్నాం. అయినా పొల్యూషన్ సెంటర్లు పేరు చెప్పి ట్యాక్సీ డ్రైవర్లను వేధిస్తున్నారు. కొండ మీదకు వెళ్లే వాహనాల్లో ఎక్కువ శాతం 2004కు ముందున్నవేనని, ఎలాంటి సమాచారం డ్రైవర్లకు ఇవ్వకుండా 2004 వాహనాలను కొండెక్కకుండా నిషేధించారు. తర్వాత పోరాటం చేస్తే 5 నెలలు సమయం ఇచ్చారు. ఆ వాహనాలకు కనీసం రెండేళ్లు సమయం ఇవ్వాలి. అలాగే డ్రైవర్లకు సబ్సిడీతో కొత్త వాహనాలు  ఇచ్చేలా చూడాల"ని కోరారు. లైసెన్స్డు కూలీలు, తిరుమల తిరుపతి ట్యాక్సీ డ్రైవర్స్ కు సంబంధించిన సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారికి హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: