ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు జిల్లా పర్యటనల్లో వరుసగా నిరసనలు ఎదురవుతున్నాయి .  ఇటీవల రాజధాని అమరావతి లో పర్యటించిన చంద్రబాబు నాయుడుకు రైతుల నుంచి నిరసన ఎదురయిన విషయం తెల్సిందే .  ఇక తాజాగా కర్నూలు జిల్లా పర్యటన సందర్బంగా విద్యార్థి , యువజన సంఘాల నేతలు సైతం,  చంద్రబాబు కాన్వాయి ని అడ్డుకుని నిరసన తెలిపే ప్రయత్నం చేశారు . పోలీసులు వారిని అడ్డుకుని , అదుపులోకి తీసుకున్నారు . కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై చంద్రబాబు స్పష్టతనివ్వాలని వారు డిమాండ్ చేశారు .

 

 ఇక ఇటీవల అమరావతి పర్యటన సందర్బంగా  చంద్రబాబు  నాయుడు నేతృత్వం లోని  టీడీపీ బృందానికి కొంతమంది రైతులు స్వాగతం పలకగా, మరికొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినదించడమే కాకుండా కాన్వాయి పై రాళ్లు , చెప్పులు విసిరారు . అయితే ప్రతిపక్ష నేత , జడ్ కేటగిరి సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు కాన్వాయి పై రాళ్లు , చెప్పులు విసురుతున్న విధుల్లో ఉన్న  పోలీసులు వారిని నిలువరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు . ఇదే విషయమై గవర్నర్ ను టీడీఎల్పీ ఉప నేత , మాజీమంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వం లో టీడీపీ బృందం కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు .

 

 పోలీసుల నిర్లక్ష్య వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది .  ఇక   ఇప్పటికే ఈ అంశం పై ప్రత్యేక దర్యాప్తు  బృందం తో దర్యాప్తు చేయాలని పోలీసు శాఖను   రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది . చంద్రబాబు కాన్వాయి పై రాళ్లు, చెప్పులు దాడి ఘటన లో పోలీసుల వైఫల్యం ఉన్నదా ? లేదా ?? అన్నదానిపై సిట్ బృందం దర్యాప్తు లో తేలనుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: