`మందు తాగి బండి న‌డిపితే...పోలీసుల‌కు దొరికిపోయాం అనుకో...ఫైన్ క‌ట్టి బ‌య‌ట‌ప‌డ‌చ్చు. మద్యం తాగి మూడుసార్లు పట్టుబడటం, సిగ్నల్స్‌ జంప్‌, ఓవర్‌లోడ్‌, పరిమితికి మించి ప్రయాణించడం వంటి కేసుల్లో డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేస్తున్నారు. అయితే ఏముంది...కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే స‌రిపోతుంది` ఇది చాలా మందిలో ఉన్న ఫీలింగ్‌. మందు తాగి బండి న‌డిపి వారి జీవితాన్ని నాశ‌నం చేసుకోవ‌డ‌మే కాకుండా...మిగ‌తా వారికి అలాంటి ప‌రిస్థితే  క‌ల్పిస్తున్నారు. అయితే, తాజాగా ఓ షాకింగ్ లాంటి వార్తను ఇలాంటి వారు వినాల్సిందే.  ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్సులు జారీచేస్తుండటంతో డ్రైవింగ్‌ లైసెన్సు రద్దయిన వాహనదారుడు, ఒకే వ్యక్తి రెండు డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకోకుండా గుర్తించడం సులువైంది. ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దులో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. 

 

 

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై, ట్రాఫిక్‌, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై ర‌వాణ‌శాఖ‌ కఠినంగా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే.  రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై రవాణాశాఖ ఉక్కుపాదం మోపడంలో భాగంగా.. జరిమానాలతో పాటు డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేస్తోంది. 2015 నుంచి ఇప్పటివరకు 21,194 లైసెన్సులపై వేటుపడింది. త్వరలో మరో ఆరు వేల లైసెన్సుల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఇక్క‌డితోనే స‌రిపెట్ట‌కుండా వారికి ఊహించ‌ని షాకిచ్చేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. 

 

మద్యం తాగి మూడుసార్లు పట్టుబడటం, సిగ్నల్స్‌ జంప్‌, ఓవర్‌లోడ్‌, పరిమితికి మించి ప్రయాణించడం వంటి కేసుల్లో తొలుత జరిమానాలతో సరిపెడుతూనే, పదేపదే నిబంధనలను ఉల్లంఘించేవారి డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేస్తోంది. ఒకసారి లైసెన్స్‌ రద్దుచేసిన చేసిన తర్వాత నిర్దేశితకాలంలో రాష్ట్రంలో మరెక్కడా డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోకుండా రవాణాశాఖ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇక నుంచి లైసెన్స్‌ల రద్దు, పునరుద్ధరణపై నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. న‌వాణాశాఖ జేటీసీ రమేశ్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీసీ పాపారావు  తాజాగా మీడియాతో మాట్లాడుతూ...‘రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా దాడులు ఉధృతం చేస్తున్నాం. కేసుల నమోదుతో రోడ్డు ప్రమాదాలు గతంలో పోల్చితే గణనీయంగా తగ్గాయి. ఒకసారి లైసెన్సు రద్దయిన వ్యక్తి పునరుద్ధరించుకున్న తర్వాత మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌ లైసెన్సును రద్దు చేసే ఆలోచన చేస్తున్నాం. ’ అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: