ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలిగి నేడు ఏ విధంగా ముందుకి వెళ్ళాలో అర్ధం కాని పరిస్థితుల్లో దగ్గుబాటి కుటుంబం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు... ఆ ఎన్నికల్లో కుమారుడు హితేష్ ని రంగంలోకి దింపుదామని భావించినా ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండటంతో స్వయంగా ఆయనే ఎన్నికల్లో పోటి చేశారు. ఎన్నిక‌ల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడంతో ఇక అక్కడి నుంచి ఆయనకు ఇబ్బందులు మొదలయ్యాయి.

 

జగన్ ఆయన్ను దూరం పెడుతున్నారనే విషయం కొన్ని రోజులకు స్పష్టంగా అర్ధమైంది. భార్యా భర్తలు ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలి అనే షరతు జగన్ పెట్టడం, ఎన్నికల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసిన రావి రామనాథం బాబుకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో దగ్గుబాటి భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని చర్చలు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు.

 

అయితే ఇందుకు చంద్రబాబు కుటుంబం అంగీకరించలేదని అంటున్నారు. పురందరేశ్వరి బిజెపిలో ఉన్నా ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉందని చెప్పడం దాదాపుగా కష్టమే. దీనితో ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని కుటుంబం తీసుకుందని అంటున్నారు. అన్ని బాగుంటే తెలుగుదేశంలోకి వెళ్లాలని చూస్తున్నారని... అక్కడకు వెళ్ళడం సాధ్యం కాని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట.

 

ద‌గ్గుబాటి దంప‌తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నందునే జ‌గ‌న్ ఉంటే ఇద్ద‌రూ ఒకే పార్టీలో ఉండండి.. లేక‌పోతే వ‌ద్ద‌ని ఖ‌రాఖండీగా చెప్పేశారు. ఇప్పుడు వెంక‌టేశ్వ‌ర‌రావు టీడీపీలోకి వ‌చ్చినా రేపు బీజేపీలో ఉండి ప‌ద‌వి కోసం కాచుకుని కూర్చొని ఉన్న పురందేశ్వ‌రి టీడీపీపై విమ‌ర్శ‌లు చేయ‌క మాన‌రు. మ‌ళ్లీ ఇక్క‌డ కూడా అదే ప‌రిస్థితి వ‌స్తుంది. ఏదేమైనా రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన కుటుంబం నేడు ఈ పరిస్థితుల్లో ఉండటం మాత్రం బాధాకరమే.

మరింత సమాచారం తెలుసుకోండి: